హైదరాబాద్ : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం ఓట్లు పోలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో 112 మంది ఓటర్లలో 88 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తం 112 మంది ఓటర్లలో 31 మంది ఎక్స్-అఫిషియో సభ్యులు, వారిలో 22 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లలో 66 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. AIMIM తన అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్‌ను నిలబెట్టగా, N గౌతమ్ రావు BJP తరపున పోటీ చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి.
బ్యాలెట్ పద్ధతిలో జరగిన ఈ పోలింగ్‌కు ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం ఒక పోలింగ్ కేంద్రం, కార్పొరేటర్లకు మరో కేంద్రం ఏర్పాటు చేశారు. 500 పోలింగ్ కేంద్రంలో ఓ మైక్రో అబ్జర్వర్‌తో పాటు, ఓ కౌంటింగ్ సూపర్ వైజర్, 2 సహాయకులతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక కోసం 250 మంది పోలీసుల బందోబస్తుతో పాటు మొత్తం 500 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక జరగడం గమనార్హం.
పోలింగ్ తర్వాత, బ్యాలెట్ బాక్సులను భద్రతతో రిసెప్షన్ సెంటర్‌కు తీసుకువచ్చారు. తనిఖీ తర్వాత, వాటిని స్ట్రాంగ్ రూమ్ లోపల భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు శుక్రవారం అంటే రేపు ఏప్రిల్ 25న జరగనుంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య విజయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, ఏప్రిల్ 25న వెలువడే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.