హైదరాబాద్: భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులు ‘తెలంగాణ రైజింగ్’ ప్రచారంలో భాగస్వాములుగా చేరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల జీవితాలను మార్చేందుకు మేం చేపట్టిన మిషన్‌లో చేరాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాని సీఎం అన్నారు. మీరే “తెలంగాణ రైజింగ్” బ్రాండ్ అంబాసిడర్లుగా మారి.. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
తన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోందని సీఎం అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు 100 కి పైగా దేశాల ప్రతినిధులు హాజరైన భారత్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా, తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న పురోగతి, సంక్షేమ పథకాలు, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
పారదర్శక సంస్కరణలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని సీఎం అన్నారు. “విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు దశాబ్దాలుగా సాగిన పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మొదటి దశాబ్దంలో ప్రజల నెరవేరని ఆకాంక్షల కారణంగా తలెత్తిన నిరాశను తొలగించడానికి ఆ వర్గాల ఆశలను నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తోంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.
భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను మేం ప్రారంభించాం. 15 ఆగస్టు 2024 న రూ.20,617 కోట్లు చెల్లించి 25లక్షల 50 వేల మంది రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేశాం. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలంగాణ రైతాంగానికి అప్పుల నుంచి విముక్తి లభించింది. భారతదేశంలోనే ఇది అతిపెద్ద రుణ మాఫీ అని సీఎం అన్నారు.
“మా మహిళా పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలతో పోటీ పడుతున్నారు” అని ఆయన అన్నారు. రాష్ట్ర పెట్టుబడి లక్ష్యాల వైపు ప్రతినిధుల దృష్టిని ఆకర్షిస్తూ, దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌లలో పెట్టుబడి శిఖరాగ్ర సమావేశాల ద్వారా ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ఆయన అన్నారు. “వీటి ద్వారా, మేము ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నాము.
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో దేశంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని ఉంచడానికి ప్రయత్నిస్తోంది” అని ఆయన వివరించారు. భారత్ సమ్మిట్‌ను వార్షిక కార్యక్రమంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు భట్టి ప్రకటించారు. “450 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధుల హాజరు, రాహుల్ గాంధీ న్యాయ్ దార్శనికతకు అనుగుణంగా, ప్రపంచ న్యాయం, శాంతిపై ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి సరైన వేదికను అందించింది” అని ఆయన నొక్కి చెప్పారు.