హైదరాబాద్: తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగిన పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో జరిగిన విస్ఫోటనంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. కాగా, ఈ ప్రమాదం ధాటికి పరిశ్రమ ఏర్పాటు చేసిన భవనం కుప్పకూలింది.
ప్రొపెల్లెంట్ తయారు చేసే యూనిట్‌లో పేలుడు సంభవించడమే ఈ విషాదానికి దారితీసిందని పోలీసులు తెలిపారు. పేలుడు ఎలా జరిగిందో వెంటనే స్పష్టంగా తెలియలేదని వారు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు…పేలుడుకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మరణించినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను భూవనగిరిలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి గురైన వారిని చాడ గ్రామానికి చెందిన రాజబోయిన శ్రీకాంత్, పులిగిల్ల గ్రామానికి చెందిన బుగ్గ లింగస్వామి, ఆత్మకూరు గ్రామానికి చెందిన నరేష్, కుందుకూరి గ్రామానికి మహేందర్, ఆలేరుకు చెందిన బర్ల శ్రీకాంత్, అనాజిపురం గ్రామానికి చెందిన నల్ల మహేష్ గా గుర్తించారు. మిగిలిన వారి సమచారాం తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది జనవరిలో, జిల్లాలోని పేలుడు పదార్థాల ఉత్పత్తికి సంబంధించిన కర్మాగారంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఇలా తరచూ పరిశ్రమలో ప్రమాదాలు జరుతుండడంతో దీనిని ఇక్కడినుంచి తరలించాలని స్థానికులు ధర్నా నిర్వహించారు.