పనాజీ : గోవాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి షిర్గావ్‌లో జరిగిన శ్రీ లైరాయ్ జాత్రలో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ (జిఎంసి) మాపుసాలోని ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక- విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. పరిస్థితిని తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదికను అందజేయాలంటూ జిల్లా అధికార, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్థానిక పరిపాలన బాధితులకు సహాయం చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
శ్రీదేవి లైరాయ్ జాతర శుక్రవారం మొదలైంది. జాతర పాల్గొనేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న ‘నిప్పులపై నడిచే ఆచారంలో శనివారం తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది. తొక్కిసలాట చోటుచేసుకుంది. ఘటనేపై వెంటనే దర్యాప్తు చేపట్టినట్టు, ఆ తర్వాతే అసలు కారణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
జాతర దృష్టా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు సుమారు 1,000 మంది పోలీసు అధికారులు విధుల్లో ఉన్నారని, రద్దీని నియంత్రించడానికి డ్రోన్లను ఉపయోగించారని అధికారులు తెలిపారు. అయినప్పటికీ తొక్కిసలాట జరగడం గమనార్హం.