వాషింగ్టన్ : పాకిస్తాన్‌పై భారత దాడులు ఊహించినవేనని, అది చాలా త్వరగా ముగుస్తుందని తాను ఆశిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మేరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు ఈ దాడుల గురించి వివరించారని వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటనలో తెలిపింది.
“ఇది సిగ్గుచేటు” అని అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో వార్తా విలేకరులతో జరిగిన సంభాషణలో అన్నారు. “మేము ఓవల్ ఆఫీసునుంచి వెళుతున్నప్పుడు భారత్ దాడుల గురించి విన్నాము… ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా ఘర్షణ పడుతున్నాయి. వీలైనంత త్వరగా పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.”
నిజానికి, భారతదేశం, పాకిస్తాన్ రెండూ శక్తివంతమైన దేశాలు. ఈ రెండు అణ్వాయుధ శక్తులు యుద్ధం వైపు కదులుతున్నట్లు ఎవరూ చూడకూడదు. రెండు దేశాలకు ఉద్రిక్తతను తగ్గించుకోవాలి. నేటి ప్రపంచం యుద్ధాన్ని కాదు, శాంతిని కోరుకుంటుందని’ ట్రంప్ తెలిపారు.
“భారతదేశం దాడులు ఖచ్చితమైనవి. అవి బాధ్యతాయుతంగా రూపొందించారు. పాకిస్తానీ పౌర, ఆర్థిక లేదా సైనిక లక్ష్యాలను ఢీకొట్టలేదు. తెలిసిన ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు.”
భారతదేశానికి “విశ్వసనీయ ఆధారాలు, సాంకేతిక సమాచారం, ప్రాణాలతో బయటపడిన వారి సాక్ష్యం, ఈ దాడిలో పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదుల స్పష్టమైన ప్రమేయం ఉన్నట్లు సూచించే ఇతర ఆధారాలు” ఉన్నాయని, పాకిస్తాన్ నేరస్థులపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, ఈ చర్య గురించి తనకు తెలుసునని, కానీ ఇప్పుడు వ్యాఖ్యానించడం చాలా తొందరపాటు అవుతుందన్నారు. అమెరికా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని కూడా ఆయన తెలిపారు. ఈ సంఘటన తర్వాత, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా NSA, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడి భారతదేశ వైఖరిని వారికి తెలియజేశారు.