న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దేశ బహిష్కృత మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని రాజకీయ పార్టీ అవామీ లీగ్ కార్యకలాపాలను నిషేధించింది. ఈ మేరకు అధికార యూనస్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హసీనా పార్టీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు యూనస్ నివాసం వెలుపల ర్యాలీ చేసిన ఒక రోజు తర్వాత ఈ నిషేధం ప్రకటన వచ్చింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద అవామీ లీగ్‌ను నిషేధించినట్లు వెల్లడించారు.
“అవామీ లీగ్, దాని నాయకులపై విచారణ ముగిసే వరకు ఉగ్రవాద నిరోధక చట్టం కింద అవామీ లీగ్ సైబర్‌స్పేస్ కార్యకలాపాలను సైతం నిషేధించాలని నిర్ణయించారు” అని ఆ దేశ న్యాయ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఆలస్యంగా విలేకరులకు తెలిపారు.
గత సంవత్సరం జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా వందలాది మంది మరణించిన సంఘటనపై పార్టీ దాని నాయకులపై ప్రత్యేక ట్రిబ్యునల్ విచారణ పూర్తి చేసే వరకు అవామీ లీగ్‌పై నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
శనివారం జరిగిన ప్రత్యేక క్యాబినెట్ సమావేశం తర్వాత, నిషేధం “”ట్రిబ్యునల్ సాక్షులను కాపాడుతుంది” అని నజ్రుల్ అన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వేలాది మంది నిరసనకారులు అవామీ లీగ్‌ను నిషేధించాలని ధర్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, అవామీ లీగ్ నిషేధాన్ని తిరస్కరించింది. దానిని “చట్టవిరుద్ధం” అని పేర్కొంది. అవామీ లీగ్ అధినేత్రి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా ఆగస్టు 5న బంగ్లాదేశ్ సైన్యం అందించిన ప్రత్యేక విమానంలో భారతదేశానికి వచ్చారు.
15 సంవత్సరాల అవామీ లీగ్ పాలనకు ముగింపు పలికిన విద్యార్థి నేతృత్వంలోని ఉద్యమకారులు ప్రధానమంత్రి కార్యాలయంలోకి దూసుకురావడంతో ఆమెకు నిష్క్రమణ తప్పలేదు. అప్పటి నుండి హసీనాను అప్పగించాలని , బంగ్లాదేశ్ అధికారికంగా భారతదేశాన్ని అభ్యర్థించింది.