న్యూఢిల్లీ : పహల్గామ్ ఉగ్ర దాడి భారతీయ ముస్లింలు, కాశ్మీరీలపై ద్వేషపూరిత నేరాల నెత్తుటి జాడను మిగిల్చింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ విషాదఘటన తరువాత ఏప్రిల్ 22 నుండి మే 8 వరకు దేశవ్యాప్తంగా 184 ద్వేషపూరిత నేరాల కేసులు నమోదయ్యాయని పౌర హక్కుల రక్షణ సంఘం (APCR) ఇటీవలి నివేదికలో వెల్లడించింది..
ఈ సంఘటనలలో 84 ద్వేషపూరిత ప్రసంగం కేసులు, 39 దాడులు, 19 విధ్వంసక చర్యలు, మూడు హత్యలు ఉన్నాయి. ఈ నివేదికలో మాబ్‌లిన్చింగ్, సామాజిక, ఆర్థిక బహిష్కరణ, బెదిరింపు, వేధింపులు సహా లైంగిక హింసకు సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయని నివేదిక నిగ్గు తేల్చింది.
ఉత్తరప్రదేశ్‌లో 43 కేసులతో అత్యధిక సంఖ్యలో ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి, తరువాత మహారాష్ట్ర (24), మధ్యప్రదేశ్ (20) వరకు కేసులు ఉన్నాయని APCR నివేదిక తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడం గమనార్హం.
విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్, సకల్ హిందూ సమాజ్, హిందూ రక్షా దళ్ వంటి హిందూత్వ సంస్థలు, ప్రముఖ క్యాబినెట్ పదవులు నిర్వహిస్తున్న సీనియర్ రాజకీయ నాయకులు సహా BJP సభ్యులు వివిధ రకాల ద్వేషపూరిత నేరాలకు పాల్పడ్డారు.
నమోదయిన కేసుల్లో అత్యంత కలతపెట్టే సంఘటన… ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలోని జింఝాన గ్రామంలో ఒక ముస్లిం వ్యక్తి తన మైనర్ పిల్లల ముందు గొడ్డలితో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన వ్యక్తి “26 కే బద్లే 26 మారుంగా (26 మందికి ప్రతీకారంగా 26 మందిని చంపుతాను)” అని పదే పదే చెబుతూనే ఉన్నాడని గ్రామస్తులు ఆరోపించారు, ఇది పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకార దాడిగా చెప్పుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో, క్షత్రియ గో రక్షా దళ్ సభ్యులు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఒక ముస్లిం వ్యక్తిని చంపి, అతని బంధువును గాయపరిచారు. మంగళూరులో, “పాకిస్తాన్ అనుకూల” నినాదం చేశాడనే ఆరోపణలతో ఒక ముస్లిం వ్యక్తిని కొట్టి చంపారు. జార్ఖండ్‌లో మరో ముస్లిం వ్యక్తిని హిందూ మూక కొట్టి చంపినట్లు సమాచారం.
ఈ ద్వేషం తొమ్మిదేళ్ల వయస్సు ఉన్న ముస్లిం పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ నగరంలో, ఒక యువకుడి స్నేహితుల్లో ఒకరు పాకిస్తాన్ వ్యతిరేక పోస్టర్‌ను చింపివేసినట్లు ఆరోపణలు రావడంతో, రైట్‌వింగ్ మద్దతుదారులు అతనిని పాకిస్తాన్ జెండాపై బలవంతంగా మూత్ర విసర్జన చేయించారు.
ప్రభుత్వ అధికారులు, పత్రికా సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో, ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) అధికారి నజర్ దౌలత్ ఖాన్ పార్కింగ్ స్థలంలో కొంతమంది పురుషులను మద్యం సేవించకూడదని వారిస్తే… దుండగులు అతని యూనిఫాంను చింపేశారు. బీహార్‌లో కుర్తా పైజామా ధరించినందుకు స్థానిక జర్నలిస్ట్, అతని సోదరుడిపై 20-25 మంది దారుణంగా దాడి చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో, ఏడు నెలల గర్భవతి అయిన ముస్లిం మహిళను ఆమె మతం కారణంగా ఆమెకు చాలా కాలంగా వైద్యం అందిస్తున్న డాక్టర్ అవమానించారని, వైద్య సహాయం నిరాకరించిదన్న వార్తలు ముస్లింలపై ద్వేషానికి నిదర్శనం. అదేసమయంలో భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఒకటైన బిధాన్ చంద్ర కృషి విశ్వవిద్యాలయ (BCKV) వ్యవసాయ విభాగం ప్రవేశ ద్వారం నోటీసు బోర్డుపై “కుక్కలు, ముస్లింలకు అనుమతి లేదు. అందరి దృష్టి పహల్గామ్ పైనే. ఉగ్రవాదం అంటే ఇస్లాం” అనే సందేశంతో కూడిన ఇస్లామోఫోబిక్ పోస్టర్ అతికించారు.
పహల్గామ్ తర్వాత, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో చదువు లేదా పని కోసం బయటి రాష్ట్రాలకు వెళ్లిన కాశ్మీరీలను హాస్టళ్లు, అద్దె ఇళ్లను ఖాళీ చేయమని ఆదేశించడం, సహోద్యోగులు లేదా క్లాస్‌మేట్స్ శారీరకంగా దాడి చేయడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రైట్-వింగ్ నిర్వాహకులు లైంగిక హింస, అత్యాచారాలకు పిలుపునివ్వడం వంటి నివేదికలు చూస్తే ఒళ్లు గగుర్బాటు తప్పదు.
పహల్గామ్ దాడి తర్వాత ద్వేషపూరిత నేరాలలో ఆందోళనకరమైన పెరుగుదలను ఏపీసీఆర్ నివేదిక హైలైట్ చేస్తుంది. రాజకీయ పార్టీలు, రైట్-వింగ్ సంస్థలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ ఫలితాలు ముస్లింలు, కాశ్మీరీల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. అయితే అటువంటి హింసను ఆపడానికి ఆయా రాష్ట్రాలు చర్య తీసుకోకపోవడం శోచనీయం.