న్యూఢిల్లీ : ‘భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం, అణు సంఘర్షణను ముందస్తుగా నివారించడం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చింది. కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలనే ట్రంప్ ప్రతిపాదనను కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
దక్షిణాసియాలో అణు యుద్ధాన్ని నివారించాలన్న ట్రంప్ పదే పదే చేసిన వాదనలను తోసిపుచ్చిన భారతదేశం, పాకిస్తాన్ దూకుడు దాడులకు ప్రతిస్పందనగా తన సాయుధ దళాలు తీసుకునే అన్ని సైనిక చర్యలు “సంప్రదాయ యుద్ధం” పరిధిలోకి వస్తాయని నొక్కి చెప్పింది.
భారతదేశంపై సైనిక దాడులకు ప్రతిస్పందనగా తన అణ్వాయుధాలను ఉపయోగించే ఎంపికను ఇస్లామాబాద్ ఎప్పుడూ పరిగణించలేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఒక టీవీ ఇంటర్వ్యూలో చేసిన ప్రకటనను న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉదహరించింది. భారత్- పాకిస్తాన్ రెండింటితో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని బెదిరించడం ద్వారా అమెరికా రెండు దక్షిణాసియా దేశాలను “కాల్పు విరమణ”పై అంగీకరించమని బలవంతం చేసిందనే ట్రంప్ వాదనను న్యూఢిల్లీ తిరస్కరించింది.
మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి మే 10న సైనిక చర్యల విరమణపై భారతదేశం, పాకిస్తాన్ మధ్య అవగాహన కుదిరే వరకు న్యూఢిల్లీలో అమెరికా అధికారులు, ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలలో వాణిజ్య సమస్య ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
“జమ్మూ కాశ్మీర్ భారత కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఏదైనా సమస్యను భారతదేశం, పాకిస్తాన్ ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలనే మావైఖరి ఏమీ మారలేదని విదేశాంగ ప్రతినిధి న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు.
కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో సహాయపడటానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు చేసిన తాజా ప్రతిపాదనపై న్యూఢిల్లీ ప్రతిస్పందనపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
కాశ్మీర్‌కు సంబంధించి “పెండింగ్‌లో ఉన్న ఏకైక విషయం” భారత కేంద్రపాలిత ప్రాంతంలో అంతర్భాగమైన కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించడాన్ని అంతం చేయడమే అనే మోడీ ప్రభుత్వ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. కాశ్మీర్ వివాదంపై భారతదేశం, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ చేసిన ప్రతిపాదనను మోడీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు, ఇది రెండు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక సమస్య అని అన్నారు.
భారత్ – పాకిస్తాన్ మధ్య 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ ప్రకటన రెండు పొరుగు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో మూడవ పక్షం ఎటువంటి పాత్ర పోషించడానికి అవకాశం ఇవ్వలేదని న్యూఢిల్లీ చాలా సంవత్సరాలుగా వాదిస్తోంది. దాదాపు నాలుగు రోజుల సరిహద్దు సైనిక దాడులు, ప్రతిదాడులను ముగించడానికి రెండు దక్షిణాసియా దేశాలు చేసుకున్న ఒప్పందాన్ని న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లోని రెండు ప్రభుత్వాలు ధృవీకరించముందే, ట్రంప్ శనివారం వాషింగ్టన్లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య “కాల్పుల విరమణ” ప్రకటించటం ఇప్పడు కాస్తా వివాదాస్పదమైంది.