దోహా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్య ప్రాచ్య పర్యటనలో భాగంగా సౌదీ పర్యటనను ముగించుకొని నిన్న ఖతర్ చేరుకున్నారు. ఖతర్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికాలోని బోయింగ్ సంస్థ నుంచి విమానాలు కొనుగోలు చేసేందుకు 200 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈమేరకు అమెరికా, ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మధ్య $1.2 ట్రిలియన్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని వైట్ హౌస్ ఒప్పందాల పేర్కొంది.
ఈ ఒప్పందాలలో GE ఏరోస్పేస్ ఇంజిన్‌లతో 210 వరకు బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్, 777X విమానాలను కొనుగోలు చేయడానికి ఖతార్ ఎయిర్‌వేస్‌తో $96 బిలియన్ల ఒప్పందం ఉందని అమెరికా తెలిపింది. ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్, ఇతర వైమానిక రక్షణ, సముద్ర భద్రతా సామర్థ్యాలలో $38 బిలియన్ల పెట్టుబడుల ప్రకటన కూడా వాటిలో ఉందని తెలిపింది.
మొత్తంగా చరిత్రలోనే తొలిసారిగా విమానాల తయారీ సంస్థ బోయింగ్ అతిపెద్ద ఆర్డర్‌ను పొందింది. 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17 లక్షల కోట్లు)తో 160 విమానాల కొనుగోలుకు బోయింగ్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ ఆర్డర్‌ను ఇచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వెల్లడించారు.ఇది బోయింగ్ సంస్థకు లభించిన అద్భుతమైన ఆర్డర్ అని ఆయన ప్రశంసించారు.
అరబ్ దేశాల సంపద చూసి ఆశ్చర్యపోయిన ట్రంప్
అగ్రరాజ్యాధినేత ట్రంప్ తన పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఖతార్, సౌదీ అరేబియాల సంపదను చూసి ఆశ్చర్యపోయారు. వారి రాజభవనాలు చూసి అసూయపడ్డానని, ఖతార్ రాజప్రసాదం అద్భుతంగా ఉందని కొనియాడారు. వీటిని జీవితంలో కొనలేమని ట్రంప్ వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశ పాలకుల నివాసాలు ఇంద్రభవనాలని, భూలోక స్వర్గాలని పొగిడారు.