న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల అక్రమ దిగుమతికి సంబంధించిన దాదాపు రూ.100 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత మోసంలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన ఒక లగ్జరీ కార్ డీలర్‌ను గుజరాత్లో అరెస్టు చేశారు. ‘కార్ లాంజ్’ షోరూమ్ యజమాని బషరత్ ఖాన్ విదేశాల నుండి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లను విలువ తగ్గించి చూపడంలో (కొన్ని సందర్భాల్లో వాటి వాస్తవ విలువలో దాదాపు 50 శాతం) కీలక పాత్ర పోషించాడని అధికారులు తెలిపారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ప్రకారం, ఖాన్ అధిక కస్టమ్స్ సుంకాలను తప్పించుకోవడానికి నకిలీ పత్రాలు, తక్కువ విలువ కలిగిన ఇన్వాయిస్లను ఉపయోగించారు. లగ్జరీ వాహనాలను యునైటెడ్ స్టేట్స్, జపాన్ వంటి దేశాల నుండి తీసుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వాటిని దుబాయ్ లేదా శ్రీలంక తీసుకెళ్లి అక్కడ భారత రహదారి అవసరాలను తీర్చడానికి వాహనాలను ఎడమ-చేతి డ్రైవ్ నుండి కుడి-చేతి డ్రైవ్‌కు మార్చారు. ఆ తర్వాత వాహనాలను నకిలీ పత్రాలను ఉపయోగించి భారతదేశంలోకి దిగుమతి చేసుకున్నారు.
ఇప్పటివరకు కనీసం 30 హై-ఎండ్ వాహనాల అక్రమ దిగుమతి చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో హమ్మర్ EV, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, లింకన్ నావిగేటర్ వంటి మోడళ్లు ఉన్నాయి.
గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో లగ్జరీ కార్ల షోరూమ్‌ను నడుపుతున్న ఖాన్ ఒక్కడే ఎనిమిది వాహనాలను దిగుమతి చేసుకున్నాడని, దీని వలన రూ. 7 కోట్లకు పైగా కస్టమ్స్ సుంకం ఎగవేత జరిగిందని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ‘కార్ లాంజ్’ షోరూమ్‌లో ఆయా కార్లలో మార్పులు, చేర్పులు చేసే వర్క్‌షాప్ కూడా ఉంది.
ఖాన్‌కు అతని వ్యాపార భాగస్వామి డాక్టర్ అహ్మద్ సహాయం చేసినట్లు తెలిసింది – అతను తన ఫామ్‌హౌస్‌లో అనేక దిగుమతి చేసుకున్న లగ్జరీ వాహనాలను నిల్వ చేశాడు. ఖాన్ అనేక మంది ప్రముఖ రాజకీయనాయకులతో సంబంధాలను ఏర్పరచుకుని, వారికి హై-ఎండ్ వాహనాలను విక్రయించాడు. ఆ తర్వాత అతని వ్యాపారం వృద్ధి చెందిందని DRI అధికారులు తెలిపారు. ఈ కస్టమర్లలో చాలామంది పన్నులను తప్పించుకోవడానికి ఖాన్‌కు నగదు చెల్లించినట్లు తెలిసింది.
దిగుమతి నెట్వర్క్ హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ అంతటా విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఖాన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలిపారు.