న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం 151వ స్థానంలో నిలిచింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సర్వే చేసిన 180 దేశాలలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశం ర్యాంకింగ్ మునుపటి సంవత్సరం 159 నుండి ఈ సంవత్సరం 151కి మెరుగుపడింది.
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అని పిలవబడే ప్రభుత్వేతర సంస్థ 2002 నుంచి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికను ప్రచురిస్తోంది. రాజకీయ, ఆర్థిక, శాసన, సామాజిక, భద్రత అనే ఐదు సూచికల ఆధారంగా ఆయా దేశాలలో పత్రికా స్వేచ్ఛను అంచనా వేస్తుంది. దీని ప్రకారం.. 2024లో భారత ర్యాంకు 159గా, 2023లో 161గా ఉన్నది. ఈ సారి ర్యాంకు కాస్త మెరుగుపడినా.. అది ఆశించినంత స్థాయి కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత ప్రదర్శన ‘చాలా తీవ్రమైన’ వర్గంలోనే ఉన్నదని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వివరించింది.
రాజకీయ దిగ్గజాల చేతుల్లో మీడియా యాజమాన్యం కేంద్రీకృతమై ఉన్న కారణంగా మీడియా బహుళత్వానికి ముప్పు వాటిల్లుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ స్థితిని మొదటిసారిగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టు సూచిక వర్గీకరించింది.
కాగా, ర్యాంకింగ్‌లను ఖరారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యక్తుల నుండి ప్రతిస్పందనలను కోరారు.”ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో విధాన నిర్ణేతలు, జర్నలిస్టులు, ఇతరులతో కూడిన విభిన్నమైన సమూహం ఉంది” అని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ థిబౌట్ బ్రూటిన్ ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.
మొత్తంగా పత్రికా స్వేచ్ఛ విషయంలో నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్స్ దేశాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌కు పొరుగున్న ఉన్న దేశాలు పత్రికా స్వేచ్ఛలో మనకంటే మంచి స్థానాల్లోనే ఉండటం గమనార్హం. నేపాల్ (90వ స్థానం), మాల్దీవులు (104), శ్రీలంక (139), బంగ్లాదేశ్ (149)ల కంటే భారత్ దిగువ స్థానంలో ఉన్నది. భూటాన్ (152), పాకిస్తాన్ (158), మయన్మార్ (169), ఆఫ్ఘనిస్తాన్ (175)లు భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి.
భారతదేశంలో దాదాపు 900 ప్రైవేట్ యాజమాన్యంలోని టీవీ ఛానెళ్లు ఉన్నాయి. దాదాపు 1,40,000 ప్రచురణలు 20 కంటే ఎక్కువ భాషలలో ప్రచురితమవుతున్నాయి, వీటిలో దాదాపు 20,000 దినపత్రికలు 390 మిలియన్లకు పైగా సర్క్యులేషన్ కలిగి ఉన్నాయని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ తెలిపింది.
ఈ సూచికలో అమెరికా 57వ స్థానంలో ఉంది, గత సంవత్సరం ర్యాంకింగ్ నుండి రెండు స్థానాలు దిగజారిపోయింది. ఆస్ట్రేలియా (29వ స్థానం), కెనడా (21వ స్థానం) చెకియా (10వ స్థానం) వంటి ఉన్నత ర్యాంకు పొందిన దేశాలలో కూడా, మీడియా ఏకాగ్రత ఆందోళన కలిగించే అంశం అని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ తెలిపింది.
రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ లేదా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేది పారిస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక అంతర్జాతీయ లాభాపేక్షలేని మరియు ప్రభుత్వేతర సంస్థ, ఇది సమాచార స్వేచ్ఛ హక్కును కాపాడటంపై దృష్టి పెడుతుంది.