గాంధీనగర్ : గుజరాత్ రాష్ట్రం ఉపాధిహామీ పనుల్లో 71కోట్ల భారీ కుంభకోణం చోటుచేసుకుంది. ఉపాధిహామీ చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన మంత్రి కుమారుడే అడ్డంగా దోచుకున్నాడు. ఈ కేసులో గుజరాత్ రాష్ట్ర పంచాయతీ, వ్యవసాయ మంత్రి బచుభాయ్ ఖాబాద్ కుమారుడు బల్వంత్ ఖాబాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు, ఈ కుంభకోణంలో కొన్ని కాంట్రాక్ట్ ఏజెన్సీలు పని పూర్తి చేయకుండా లేదా వస్తువులను సరఫరా చేయకుండానే ప్రభుత్వం నుండి చెల్లింపులు పొందాయని పోలీసులు తెలిపారు.
దాహోద్ జిల్లాలో అప్పటి తాలూకా అభివృద్ధి అధికారి (TDO) దర్శన్ పటేల్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు, ఇప్పటివరకు అరెస్టు అయిన వ్యక్తుల సంఖ్య ఏడుకు చేరుకుందని ఒక అధికారి తెలిపారు.
2021- 2024 మధ్య కాలంలో ప్రభుత్వ అధికారులతో కలిసి 35 ఏజెన్సీల యజమానులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం కింద చెల్లింపు పొందడానికి నకిలీ ధృవీకరణ పత్రాలు, ఇతర ఆధారాలను చూపించి రూ.71 కోట్లు స్వాహా చేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
గిరిజనులు ఎక్కువగా నివసించే దాహోద్ జిల్లాలోని దేవ్‌గఢ్ బరియా, ధన్‌పూర్ తాలూకాల పరిధిలోని ప్రాంతాల్లో MGNREGA పనుల్లో మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజెన్సీల్లో బల్వంత్ ఖాబాద్ సంస్థ కూడా ఉందని ఒక పోలీసు అధికారి తెలిపారు.
“జిల్లాలో MGNREGA కుంభకోణానికి సంబంధించి దహోద్ పోలీసులు బచుభాయ్ ఖాబాద్ కుమారుడు బల్వంత్ ఖాబాద్, అప్పటి TDO దర్శన్ పటేల్‌లను అరెస్టు చేశారు. మేము ఇంతకు ముందు ఐదుగురిని అరెస్టు చేసాము” అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, దర్యాప్తు అధికారి జగదీష్‌సిన్హ్ భండారి అన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) రూ. 71 కోట్ల కుంభకోణాన్ని వెలికితీసిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగులు సహా గుర్తు తెలియని వ్యక్తులపై మోసం, ఫోర్జరీ,నమ్మక ద్రోహం అభియోగాలపై పోలీసులు గత నెలలో FIR నమోదు చేశారు.
క్షేత్ర పర్యటనల సమయంలో, RDA అధికారులు ఆ రోడ్లకు కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగాయని, కానీ చెల్లింపును స్వీకరించడానికి కాగితంపై పూర్తయినట్లు చూపించారని FIR తెలిపింది. జనవరి 2021, డిసెంబర్ 2024 మధ్య దహోద్‌లోని రెండు తాలూకాలలో రోడ్లు, చెక్ డ్యామ్‌లు, రాతి కట్టలను నిర్మించే పనిని ఈ ఏజెన్సీకి అప్పగించారు.
సామాగ్రిని సరఫరా చేయడానికి అనర్హులు లేదా టెండర్ ప్రక్రియలో పాల్గొనని ఏజెన్సీలకు కూడా చెల్లింపులు జరిగాయని పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.