హైదరాబాద్: గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాద ఘటన ఒక గుణపాఠమని అన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తుందన్న హైడ్రా కమిషనర్ వెల్లడించారు. అగ్నిప్రమాదాలన్నింటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్‌లోని పాత భవనాలలో తీసుకోవలసిన భద్రతా చర్యలను అధ్యయనం చేస్తోందని హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ వెల్లడించారు.
ఈ దుర్ఘటనలో 17 మంది అగ్నికి ఆహుతైన నేపథ్యంలో, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ అన్నారు. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలను నివారించడానికి గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద విషాదాన్ని ఒక పాఠంగా తీసుకోవాలని రంగనాథ్ పేర్కొన్నారు.
పాత నిర్మాణాలలో అగ్ని భద్రతా చర్యలు పాటించకపోవడం, క్రమం తప్పకుండా పర్యవేక్షణ లేకపోవడం ఈ సంఘటనకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనల వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి పాత నిర్మాణాలపై నిర్దిష్ట మార్గదర్శకాలను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అధికశాతం అగ్నిప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ వళ్లే జరుగుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అందువల్ల యజమానులు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ప్రజలకు అగ్నిప్రమాదాలపై మరింత విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.