న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ గురించి పాకిస్తాన్‌కు “ప్రారంభంలోనే” తెలియజేసామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనిని “నేరం” అని అభివర్ణించారు. దాని కారణంగా వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయిందో దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
తాను అడిగిన ప్రశ్నపై విదేశాంగమంత్రి జైశంకర్ మౌనం దేశానికి నష్టం కలిగిస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ అంశాన్ని లేవనెత్తిన రెండు రోజుల తర్వాత, రాహుల్ గాంధీ మరోసారి ‘X’లో జైశంకర్ వీడియో ప్రకటనను షేర్ చేసారు. “విదేశాంగ మంత్రి జైశంకర్ వహించడం కేవలం సమాచారాన్ని వెల్లడించకపోవడం మాత్రమే కాదు. అదొక విపత్కర పరిణామం. మరోసారి అడుగుతున్నాను. పాకిస్థాన్ పై దాడుల గురించి ఆ దేశానికి ముందే తెలియడం వల్ల ఎన్ని భారతీయ విమానాలను కోల్పోయాం? ఇది తప్పిదం కాదు. నేరం. దేశానికి నిజం తెలియాలి.” అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. దీనికి జైశంకర్ గతంలో మాట్లాడిన వీడియోను జోడించారు.
ఆ వీడియోలో జైశంకర్ ఏమన్నారంటే?
ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి ముందు పాక్ కు సమాచారం ఇచ్చినట్లు జైశంకర్ చెప్పినట్లు వీడియోలో ఉంది. “ఆపరేషన్ ప్రారంభంలో తాము పాక్ కు ఒక సందేశాన్ని పంపించాం. పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్నామని, పాక్ సైనిక స్థావరాలపై కాదని చెప్పాం. ఈ దాడుల్లో జోక్యం చేసుకోకుండా పాక్ ఆర్మీ బయట నిలబడే అవకాశం ఉంది. అయితే ఆ సలహాను పాక్ పట్టించుకోలేదు” అని జైశంకర్ వ్యాఖ్యానించారు.
ఖండించిన విదేశాంగ శాఖ
అయితే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు వాస్తవాలను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఖండించింది. ఆపరేషన్ సిందూర్ మొదలైన తొలి దశలో చేసిన హెచ్చరికను, ఆపరేషన్‌కు ముందు చేసినట్లు ఆరోపించడం తప్పుడు వ్యాఖ్యగా పేర్కొంది.
రాహుల్ తాజా పోస్ట్ తర్వాత వెంటనే విలేకరుల సమావేశంలో ప్రసంగించిన కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం చైర్పర్సన్ పవన్ ఖేరా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జైశంకర్ ఇద్దరూ అమెరికా, చైనా దేశాల పట్ల మౌనంగా ఉన్నారని, ఎందుకంటే వారు రెండు దేశాలంటే”భయపడుతున్నారని” పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రస్తావిస్తూ… విదేశాంగ మంత్రికి, పాకిస్తాన్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నారు. అందుకే ఆయన వారికి ముందుగానే చెప్పారన్నారు. ఇది దౌత్యం కాదని, ఇది గూఢచర్యం అన్నారు.
విదేశాంగ మంత్రి చెప్పినది అందరూ విన్నారని, దాన్ని కప్పిపుచ్చే కుట్ర జరుగుతోందన్నారు. ఈ సమాచారం ఉగ్రవాదులు మసూద్ అజార్, హఫీజ్ సయీద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల నుండి తప్పించుకోవడానికి సహాయపడిందా అని పవన్ ఖేరా ప్రశ్నించారు. దీనిపై ప్రధాని కూడా సమాధానం చెప్పాలన్నారు.