హైదరాబాద్: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద 20,104 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. “పైలట్ ప్రాజెక్ట్ కింద, 47,335 ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు చేశారు. ఇప్పటివరకు, 5140 ఇళ్లకు బేస్‌మెంట్లు, 300 ఇళ్లకు గోడలు, మరో పది ఇళ్లకు స్లాబ్‌లు వేసారని” ఆయన తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతి సోమవారం ఎటువంటి ఆలస్యం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. “బేస్‌మెంట్‌లు పూర్తయిన 1383 ఇళ్లకు, గోడలు పూర్తయిన 224 ఇళ్లకు ప్రభుత్వం నిన్న రూ.16.07 కోట్లు విడుదల చేసింది. మొత్తం 5,364 మంది లబ్ధిదారులకు రూ.53.64 కోట్లు చెల్లించారు” అని ఆయన చెప్పారు.
ఈ పథకం కింద, డబ్బును నాలుగు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని, మధ్యవర్తుల ప్రమేయానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన అన్నారు. అంతేకాదు ప్రతి సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్దిదారుల చెల్లింపులపై అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించనున్నారు .
బేస్మెంట్ పూర్తయిన తర్వాత రూ. లక్ష, గోడలు నిర్మించిన తర్వాత రూ. 1.25 లక్షలు, స్లాబ్ వేసిన తర్వాత రూ. 1.75 లక్షలు, ఇల్లు పూర్తిగా ప్రారంభించిన తర్వాత మిగిలిన రూ. 1 లక్ష విడుదల చేస్తామని ఆయన వివరించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.