గాంధీనగర్ : అహ్మదాబాద్‌లో అక్రమ నిర్మాణాల పేరిట అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ వేలాది ముస్లింల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున కూల్చివేత డ్రైవ్‌ను ప్రారంభించింది. మొత్తం ఏడువేలకు పైగా నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించారు.
కూల్చివేతను సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించడానికి 75 బుల్డోజర్లు, 150 డంపర్లను మోహరించారు. కూల్చివేతల సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి ఏకంగా 8,000 మంది సిబ్బందితో కూడిన భారీ పోలీసు బలగాలను మోహరించారు.
మానవ హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ చర్య వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఏప్రిల్ 26 పహల్గామ్ దాడి తర్వాత అధికారులు కూల్చివేతను “జాతీయ భద్రతా” సమస్యలతో ముడిపెట్టారు. ఈ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా బంగ్లాదేశ్ వలసదారులు ఆక్రమించారని ఆరోపించారు.
సంఘటన జరిగినప్పటి నుండి, 6,500 మందికి పైగా – ప్రధానంగా ముస్లింలు – పౌరసత్వ ధృవీకరణ కోసం నిర్బంధించారు. అయితే, అత్యధికులు భారతీయ పౌరులు అని, వీరిలో చాలామంది ఆధార్, ఓటరు ID కార్డులు వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను కలిగి ఉన్నారని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.
ఏప్రిల్ 29న చందోలా సరస్సు భూమిపై నిర్మాణాలు అనధికారమని గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూల్చివేత తిరిగి ప్రారంభమైంది. ఏప్రిల్ 28న, సియాసత్‌నగర్, బెంగాలీ వాస్‌లలో 4,000 కంటే ఎక్కువ గుడిసెలు కూల్చివేసారు. వేలాదిమంది… ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, బెంగాల్ నుండి వచ్చిన పేద వలసదారులను నిర్వాసితులయ్యారు, వీరు కార్మికులు, చెత్తను ఏరుకునేవారు.
ప్రభుత్వం చట్టపరమైన మరియు భద్రతా సమస్యల ముసుగులో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటోందని కమ్యూనిటీ నాయకులు చెబుతున్నారు. మైనారిటీ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ముజాహిద్ నఫీస్ ఈ చర్యను “పూర్తిగా అమానవీయంగా” అభివర్ణించారు, పహల్గామ్ దాడిని సామూహిక తొలగింపులను సమర్థించడానికి ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. “ప్రజలు 40 సంవత్సరాలకు పైగా ఇక్కడ నివసిస్తున్నారు” అని ఆయన అన్నారు.
ఈ భావనను ప్రతిధ్వనిస్తూ, ప్రత్యామ్నాయ ఆశ్రయం కల్పించకుండా ఇళ్లను కూల్చివేసినందుకు జమాతే-ఇ-ఇస్లామి హింద్ గుజరాత్‌కు చెందిన వాసిఫ్ హుస్సేన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. “వృద్ధులు, పిల్లలను తీవ్రమైన వేడిలో బయటకు నెట్టివేస్తున్నారు, వెళ్ళడానికి స్థలం లేదు” అని ఆయన అన్నారు. అన్ని బాధిత కుటుంబాలకు తక్షణ పునరావాసం కల్పించాలని కార్యకర్తలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.