బెంగళూరు: బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిపై తప్పుడు సమాచారం అందించారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 192 (అల్లర్లకు కారణమయ్యే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం), 352 (శాంతిని ఉల్లంఘించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ హెడ్ శ్రీకాంత్ స్వరూప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళవారం హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.
మాల్వియా, అర్నాబ్ గోస్వామి “తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి నేరపూరిత కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తుర్కియేలోని ఇస్తాంబుల్ కాంగ్రెస్ సెంటర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) కార్యాలయం అనే “కల్పిత వాదనను దురుద్దేశంతో ప్రచారం” చేశారని ఆయన ఆరోపించారు.
“భారతీయ ప్రజలను మోసం చేయడం, ఒక ప్రధాన రాజకీయ సంస్థను కించపరచడం, జాతీయవాద భావాలను మార్చడం, ప్రజల్లో అశాంతిని రెచ్చగొట్టడం, జాతీయ భద్రత, ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఇలాంటి అసత్యాలు ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. మాల్వియా, గోస్వామి చర్యలు భారతదేశం- టర్కీల మధ్య దెబ్బతిన్న సంబంధాల నేపథ్యంలో, పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు భావించడం వల్ల ఏర్పడిందని స్వరూప్ పేర్కొన్నారు.
“అంతేకాదు అమిత్ మాల్వియా, అర్ణబ్ గోస్వామి చర్యలు భారతదేశ ప్రజాస్వామ్య పునాదులు, ప్రజా భద్రత, జాతీయ భద్రతపై దాడిగా భావించాలి. నేరపూరిత ఉద్దేశ్యంతో అబద్ధాలను వ్యాప్తి చేయడానికి వారు తమ ఇన్‌ప్లూయన్స్‌ను ఉపయోగించారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు.
ఈ ఫిర్యాదును అత్యవసర పరిస్థితిగా పరిగణించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, CBI సహా ఇతర చట్ట అమలు సంస్థలకు కూడా స్వరూప్ విజ్ఞప్తి చేశారు.