న్యూఢిల్లీ: కేంద్రం, తమిళనాడు మధ్య భాషా వివాదంలో మరో సంచలనాత్మక మలుపు తిరిగింది. జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేసిందని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
విద్యార్థులు ఇంగ్లీష్, ప్రాంతీయ భాషతో పాటు మూడవ భాషను నేర్చుకునే త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసే జాతీయ విద్యా విధానాన్ని డిఎంకె ప్రభుత్వం వ్యతిరేకించింది. త్రిభాషా సూత్రం మేరకు దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని రుద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. కేంద్రం ఈ ఆరోపణలను తిరస్కరించింది. త్రిభాషా సూత్రం భారతీయ భాషలను పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది.
తమిళనాడు ఇప్పుడు సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో కేంద్రం ప్రీ-స్కూల్ నుండి పన్నెండో తరగతి వరకు పాఠశాల విద్య కోసం సమగ్ర పథకం అయిన సమగ్ర శిక్షా పథకం కింద 2,151 కోట్లలో తన వాటాను అందించలేదని పేర్కొంది. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ పథకం పిల్లల ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం-2009 అమలుకు మద్దతు ఇస్తుంది. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా ఉంటుంది.
పాఠశాల విద్య కోసం ఉద్దేశించిన సమగ్ర శిక్ష పథకం అవసరాలకు అనుగుణంగా తమిళనాడు ఉందని గతేడాది ఫిబ్రవరి 16న జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశంలో కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్‌లో ప్రస్తావించింది. ఆ తర్వాత ఈ పథకం కింద ఖర్చు కోసం రూ.3,585.99 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందని పేర్కొంది. ఇందులో 60:40 నిష్పత్తి ప్రకారం, కేంద్రం వాటా రూ.2,151 కోట్లు అని తెలిపింది. ఈ నిధులు గత ఏడాది ఏప్రిల్ 1 నుంచే రాష్ట్రానికి చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే, జాతీయ విద్యా విధానం అమలు చేయడం లేదన్న కారణంతో ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని పిటిషన్‌లో వివరించింది.
త్రిభాషా సూత్రానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత చూపడమే కేంద్రం నిధులను అడ్డుకోవడానికి కారణమని DMK ప్రభుత్వం పేర్కొంది. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని బలవంతం చేయడమే నిధుల నిలిపివేత లక్ష్యమని పేర్కొంది.
కాగా, గవర్నర్ RN రవితో జరిగిన ఘర్షణలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో విజయం సాధించిన ఒక నెల తర్వాత తాజాగా తమిళనాడు మళ్లీ సుప్రీం కోర్టు మెట్లెక్కడం గమనార్హం.