హైదరాబాద్: ఆన్‌లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వయసుతో సంబంధం లేకుండా యువత, ఉన్నత విద్యావంతులు కూడా ఈ మోసాలకు గురవుతున్నారు. తాజాగా నకిలీ వర్క్ ఫ్రమ్ హోమ్ పథకం ద్వారా ఒక మహిళ నుంచి రూ.8,75,148 దోచుకున్నందుకు గానూ నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
నిందితులైన మనోజ్ దివాకర్, నగరి విజయ్, సనపతి కిషోర్ బాబు (అందరూ హైదరాబాదీలు), రంగారెడ్డికి చెందిన తిరునగరి సంతోష్ కుమార్‌గా గుర్తించారు. బాధితుడి డబ్బును లాండరింగ్ చేయడానికి వారు పలు బ్యాంకు ఖాతాలు, చెల్లింపు వ్యవస్థల ద్వారా పక్కదారిపట్టించి ఈ స్కామ్‌కు దోహదపడ్డారని తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న “అకార్ అడ్వాంటేజ్ ప్లస్ మార్కెటింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్” నుండి హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్లు నటించి నకిలీ వెబ్‌సైట్‌ను ఉపయోగించి బాధితురాలిని టెలిగ్రామ్ ద్వారా సంప్రదించారు. ఆమెకు మొదట ఆన్‌లైన్ హోటల్ బుకింగ్‌లతో కూడిన ట్రయల్ పనులు కేటాయించారు. రోజువారీ ఆదాయం రూ.17,000 నుండి రూ.18,000 వరకు ఉంటుందని హామీ ఇచ్చారు.
బాధితురాలను చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడానికి ఒప్పించారు. స్వల్ప రాబడి కూడా వచ్చేట్లు చేసి వారిప నమ్మకం వచ్చేలా చేశారు. దీంతో ఆ సంస్థపై ఆమెకు నమ్మకం పెరిగింది. తదనంతరం, “గోల్డ్ సూట్ బుకింగ్స్”, “వార్షికోత్సవ ఆఫర్స్” వంటి అధిక-విలువ పనుల వల్ల కలిగే “మైనస్ బ్యాలెన్స్‌లు” అనే నెపంతో ఆమెనుంచి పెద్ద మొత్తాలను డిపాజిట్ చేయించి మోసగించారు.
చివరికి, ఆమె రూ.15.82 లక్షల ఆదాయాన్ని క్లెయిమ్ చేయడానికి రూ.7.91 లక్షలను “సెక్యూరిటీ డిపాజిట్”గా బదిలీ చేయాల్సి వచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది.
ఫిర్యాదు ఆధారంగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి 4 మొబైల్ ఫోన్లు, 8 డెబిట్ కార్డులు, 7 బ్యాంక్ పాస్‌బుక్‌లు మరియు చెక్ బుక్‌లు, 1 ట్యాబ్ మరియు 1 స్వైపింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత, 2023లోని అనేక సెక్షన్‌లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్‌లు 66C మరియు 66D కింద కేసు నమోదు చేసారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.