న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతోపాటు బలమైన గాలులు వీచాయి. వీటి ధాటికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 ముందు భాగంలో పందిరి ఆదివారం ఉదయం పాక్షికంగా కూలిపోయిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
దేశ రాజధాని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో విమాన కార్యకలాపాల కోసం పునరుద్ధరించి, టెర్మినల్ 1 (T1) ఇటీవల ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం కూడా. తీవ్రమైన గాలులు, వర్షం దెబ్బకు కనోపీ డిజైన్ తట్టుకోలేకపోయింది. టర్మినల్-1 ముందు భాగంలోని పందిరి తట్టుకోలేకపోయిందని ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
అయితే ఈ వర్షం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (DIAL) టెర్మినల్ ఇతర నిర్మాణాలపై ఎటువంటి ప్రభావం లేదని తెలిపింది. పందిరి కూలిపోవడం గురించి ప్రకటనలో నేరుగా ప్రస్తావించలేదు. సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి, భద్రత, కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించడానికి గ్రౌండ్ బృందాలు త్వరిత చర్య తీసుకున్నాయి” అని అది తెలిపింది. టర్మినల్-1 ముందు భాగంలో ఉన్న కానోపీ పాక్షికంగా కూలిపోయిందని, ఎవరికీ గాయాలు కాలేదని ఆ వర్గాలు తెలిపాయి
భారీ వర్షం, బలమైన గాలుల దెబ్బకు శనివారం రాత్రి 11:30 గంటల నుండి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల మధ్య విమానాశ్రయంలో 17 అంతర్జాతీయ విమానాలు సహా 49 విమానాలను దారి మళ్లించారని ఆ వర్గాలు ముందుగా తెలిపాయి. దేశ రాజధానిలో మే 24 మధ్య రాత్రి భారీ వర్షపాతంతో పాటు తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని డిఐఎఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
నగరంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో 30 నుండి 45 నిమిషాల స్వల్ప వ్యవధిలో గంటకు 70-80 కి.మీ వేగంతో గాలులు వీచాయని, 80 మి.మీ కంటే ఎక్కువ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకస్మికంగా కుండపోత వర్షం కురియడంతో విమానాశ్రయం, చుట్టుపక్కల భారీగా నీరు చేరింది. దీంతో విమాన కార్యకలాపాలను పాక్షికంగా ప్రభావితం చేసిందని అది తెలిపింది. ఐజిఐఎ రోజుకు 1,300 విమానాల రాకపోకలను నిర్వహిస్తుంది.
గత సంవత్సరం జూన్‌లో, టర్మినల్-1 వర్ద పాత డిపార్చర్ ఫోర్‌కోర్ట్ వద్ద ఉన్న కానోపీ భారీ వర్షాల కారణంగా పాక్షికంగా కూలిపోయింది, దీని ఫలితంగా ఒక వ్యక్తి మరణించాడు. కనీసం ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. మరోవంక ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చని ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి.