రియాద్: సౌదీ అరేబియాలో 2026 నాటికి మద్యం అమ్మకం, వినియోగంపై 73 ఏళ్ల నిషేధాన్ని కఠినమైన లైసెన్సింగ్ వ్యవస్థ కింద ఎత్తివేయనున్నట్లు సమాచారం. రియాద్ ఎక్స్పో 2030, 2034లో ఫిఫా ప్రపంచ కప్‌తో సహా ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాల్లో భాగంగా సౌదీ ఈ ముఖ్యమైన విధాన నిర్ణయం తీసుకుంది.
సౌదీ అరేబియా 1952 నుండి మద్య నిషేధాన్ని కొనసాగిస్తోంది. అక్కడి స్థానికులు, విదేశీయులు ఇద్దరూ ఆ దేశంలో మద్య సేవించడంపై నిషేధం ఉంది. అయితే జనవరి 2024 నుండి, రియాద్‌లోని ఒక దుకాణానికి కఠినమైన నిబంధనల ప్రకారం ముస్లిమేతరులకు మద్యం విక్రయించడానికి అనుమతి లభించింది.
సౌదీ మూమెంట్స్ నివేదిక ప్రకారం, కొత్త నియంత్రణ చట్రం మేరకు సౌదీ అంతటా దాదాపు 600 వేదికలలో నియంత్రిత మద్యం అమ్మకాలను అనుమతించాలని భావిస్తున్నారు. వీటిలో ఫైవ్-స్టార్ హోటళ్ళు, లగ్జరీ రిసార్ట్లు, దౌత్య మండలాలు, సిందాలా ద్వీపం, రెడ్ సీ ప్రాజెక్ట్ వంటి ప్రధాన పర్యాటక అభివృద్ధి ప్రాంతాలు ఉంటాయి.
ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, లైసెన్స్ పొందిన వేదికలు బీర్, వైన్, సైడర్ వంటి పానీయాలను అందించడానికి అనుమతి లభిస్తుంది. అయితే, 20 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలు – స్పిరిట్స్ వంటివి – నిషేధించారు.
నిర్దిష్ట పర్యాటక మరియు విదేశీయుల-కేంద్రీకృత ప్రాంతాల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుంది, బహిరంగ ప్రదేశాలు, ప్రైవేట్ నివాసాలు, రిటైల్ అవుట్లెట్లలో నిషేధం అమలులో ఉంటుంది. అమ్మకాలు, వినియోగం ఖచ్చితంగా నియంత్రిత వాతావరణాలలో జరుగుతాయి, శిక్షణ పొందిన, లైసెన్స్ పొందిన సిబ్బంది కార్యాచరణ ప్రమాణాలు, సాంస్కృతిక వారసత్వానికి అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు.
నియంత్రిత ఆల్కహాల్‌ను అనుమతిండం ద్వారా పర్యాటక వృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులను పెంచిన UAE, బహ్రెయిన్ దేశాల అనుభవాలను సౌదీ అధికారులు ఉదహరించారు. ఈ సంస్కరణ… విజన్ 2030లో పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక, ప్రణాళిక మంత్రిత్వ శాఖ, సౌదీ టూరిజం అథారిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలు… దశాబ్దం చివరి నాటికి సౌదీ GDPలో పర్యాటక రంగం వాటా 10 శాతానికి పెంచడం దీని లక్ష్యం.