హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నష్టాలను నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణకు రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక అందింది. భారీ వర్షాల గురించి ఐఎండీ సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
జిహెచ్‌ఎంసి, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ శాఖల అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండి, వాతావరణ సూచన, వర్షాల దృష్ట్యా సమన్వయంతో పనిచేయాలని సిఎం ఆదేశించారు.
రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్‌లు, విద్యుత్ అంతరాయాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు కూడా సూచించారు. “లోతట్టు ప్రాంతాలు వరదల బారినుంచి, ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ సహా భారీ వర్షాలకు గురైన జిల్లాల్లో వరదలను క్రమం తప్పకుండా సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును సీఎం ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.