ఢాకా: ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, దేశ వ్యవస్థాపక అధ్యక్షుడు, బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాన్ని ఆ దేశ కరెన్సీ నోట్లపై నుంచి తొలగించనున్నట్లు వార్తా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. కాగా, ఆయన కుమార్తె షేక్ హసీనా గత సంవత్సరం ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత దేశం నుండి అనధికారికంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే.
అభిజ్ఞ వర్గాల నివేదికల ప్రకారం.. బంగ్లాదేశ్ ఇటీవల కొత్తగా రూపొందించిన నోట్లను జారీ చేయడం ప్రారంభించింది, వీటిలో దేశ స్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్, ‘బంగబంధు’ చిత్రాలను తీసేసారు. నిన్న బంగ్లాదేశ్‌లోని అధికారులు కొత్త శ్రేణి కరెన్సీ నోట్లను విడుదల చేసినట్లు తెలిసింది, వీటిలో చారిత్రాత్మకంగా మొదటిసారిగా ముజిబుర్ రెహమాన్ ఫోటో లేదు.
కరెన్సీ నోట్లపై మునుపటి డిజైన్‌ను తొలగించడానికి కొత్త బ్యాంకు నోట్లు ఆదివారం జారీ చేసిందని ఆయా వర్గాలు విశ్వసిస్తున్నాయి. బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంకు సీనియర్ అధికారిని ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం, కొత్తగా రూపొందించిన కరెన్సీ సిరీస్‌లో “ఇకపై ఏ వ్యక్తి ఫొటోలు ఉండవు”.
కొత్త బ్యాంకు నోట్లపై ఇప్పుడు సహజ ప్రకృతి దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు మొదలైనవి ఉన్నాయి, ఇవి బంగ్లాదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి. కొత్త కరెన్సీ నోట్లు దేవాలయాలు, బౌద్ధ ప్రార్థనా స్థలాల చిత్రాలను కూడా కలిగి ఉన్నాయి.
తొమ్మిది డినామినేషన్లలో, మూడు ఇప్పటివరకు జారీ చేసారని, మిగిలిన డినామినేషన్లు తరువాత ప్రవేశపెడతామని వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ఉన్న నోట్లు, నాణేలు చెలామణిలో కొనసాగుతాయని ఓ అధికారి తెలిపారు.
ముఖ్యంగా, నోట్ల రూపకల్పనలో ఇటీవలి మార్పు రాజకీయ పరిణామాలు ‘టాకా’ – బంగ్లాదేశ్ కరెన్సీ రూపాన్ని ప్రభావితం చేయడం ఇదే మొదటిసారి కాదు. అలాగే, బంగ్లాదేశ్‌లో బ్యాంకు నోట్లపై మొదటినుంచీ షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలు లేవని, వీటిని చాలా తరువాత ప్రవేశపెట్టారని ఆ వర్గాలు పేర్కొనడం యాదృచ్చికం.