జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం తన దమనకాండను కొనసాగిస్తూనే ఉంది. ఈ వారం రోజుల్లోనే గాజా స్ట్రిప్‌లో 240కి పైగా ఇళ్లను కూల్చివేసింది. అక్కడి ప్రజలను అక్కడినుంచి తరిమేసేందుకు, పాలస్తీనియన్ సమాజాలను నాశనం చేయడానికి ఒక క్రమబద్ధమైన ప్రచారాన్ని ముమ్మరం చేసిందని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం నివేదించింది.
నివాస భవనాలను లక్ష్యంగా చేసుకోవడం, “నగరాలను ఖాళీ చేయడం, జీవనోపాధిని నాశనం చేయడం, విస్తృత భయాన్ని, సామాజిక వెలివేతను సృష్టించడం లక్ష్యంగా ఇజ్రాయెల్ చర్యలు ఉన్నాయని గాజా మీడియా ఆఫీస్ డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్-థవాబ్తా అనడోలుతో అన్నారు.
“ఇజ్రాయెల్ తన మారణహోమాన్ని విస్తరించడానికి, నిరాయుధ పౌరులను బలవంతంగా ఖాళీ చేయించే ముందస్తు ప్రణాళికను చూపిస్తుంది” అని ఆయన అన్నారు. ధ్వంసం అయిన ఇళ్లలో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఇజ్రాయెల్ వాదనలకు విరుద్ధంగా, ఎటువంటి సైనిక లక్ష్యాలు లేవని అల్-థవాబ్తా నొక్కిచెప్పారు.
ఈ దాడులను ఇజ్రాయెల్ నుండి స్పష్టమైన సందేశంగా ఆయన అభివర్ణించారు: “లొంగిపోండి లేదా పూర్తి వినాశనాన్ని ఎదుర్కోండి” అన్న ఇజ్రాయెల్ అరాచక నినాదాన్ని తాము తిరస్కరిస్తున్నామని అల్-థవాబ్తా అన్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ ఎన్నటికి విజయం సాధించదు. ఇజ్రాయెల్ దాడులను దశాబ్దాలుగా సహించిన మన పాలస్తీనా ప్రజలు బుల్డోజర్లు లేదా క్షిపణుల ద్వారా విచ్ఛిన్నం కాలేరు” అని గాజా మీడియా ఆఫీస్ డైరెక్టర్ అన్నారు. “గాజాలో కొనసాగుతున్న ఈ రక్తపాత పిచ్చిని” ఆపడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే చర్య తీసుకోవాలని ఆయన కోరారు.
కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ పిలుపులను తిరస్కరిస్తూ, ఇజ్రాయెల్ అక్టోబర్ 2023 నుండి గాజాలో విధ్వంసకర దాడిని కొనసాగిస్తోంది. ఇప్పటికే 54,400 మందికి పైగా పాలస్తీనియన్లను చంపింది, వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు. లక్షమందికిపైగా గాయపడ్డారు. వేలమంది జాడ తెలియడంలేదు. మరికొన్ని వేలమంది శిధిలాలకింద సమాధి అయ్యారు. మరోవంక గాజా ఎన్క్లేవ్ జనాభాలో కరువు ప్రమాదం గురించి సహాయ సంస్థలు హెచ్చరించాయి.
గత నవంబర్‌లో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, అతని మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌పై యుద్ధ నేరాలు, గాజాలో మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. మరోవంక ఎన్‌క్లేవ్‌లోని పౌరులపై యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణహోమం కేసును కూడా ఎదుర్కొంటోంది.