ఛతర్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ రేషన్ దుకాణంలో జరిగిన ఘర్షణలో 19 ఏళ్ల దళిత యువకుడు కాల్పుల్లో మరణించాడని, అతని సోదరుడు పెల్లెట్‌తో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.
కాగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ సంఘటనను ఖండించారు. కేవలం దళితుడు అయిన కారణంగా 19 ఏళ్ల పంకజ్ ప్రజాపతిని పట్టపగలు కాల్చి చంపారని ఆరోపించారు.
మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా అవమానం, హింస, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలపై వివక్షతో నిండి ఉందని రాహుల్ గాంధీ ఎక్స్‌లో ఆరోపించారు.
ఛతర్‌పూర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 25 కి.మీ దూరంలో ఉన్న నౌగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిల్హారి గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేషన్ దుకాణం నుండి వస్తువులు కొనుగోలు చేస్తుండగా పంకజ్ ప్రజాపతి, మరో ముగ్గురి మధ్య వివాదం చెలరేగింది, ఆ సమయంలో వారిలో ఒకరు తుపాకీతో కాల్చారు. “ఆస్పత్రికి తరలించే క్రమంలో పంకజ్ ప్రజాపతి గ్వాలియర్ దగ్గర మరణించాడు” అని నౌగావ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) అమిత్ మెష్రామ్ అన్నారు.
ఈ ఘటనకు సంబంధించి ప్రవీణ్ అలియాస్ కట్టు పటేరియా, నవీన్ పటేరియా, సేల్స్‌మ్యాన్ రాంసేవక్ అర్జారియాపై భారతీయ న్యాయ్ సంహిత (BNS), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం, ఆయుధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
పోలీసులు నిందితుల కోసం వారి ఇళ్లలో గాలించారు. అయితే వారు పారిపోయారు. వారిని కనిపెట్టడానికి ఒక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈమేరకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ Xలో మాట్లాడుతూ…”దోషి అధికారంలో కూర్చున్నాడు. అధికారం బహుజన వ్యతిరేక బిజెపికి చెందినది” కాబట్టి ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, పోస్ట్‌మార్టం వాయిదా వేసారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
“మోదీ ప్రభుత్వం… దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలను రెండవ తరగతి పౌరులుగా చేసి, వారిని ప్రధాన స్రవంతి నుండి దూరంగా ఉంచే కుట్ర కొనసాగుతోంది” అని రాహుల్ అన్నారు. దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినమైన శిక్ష విధించాలని గాంధీ డిమాండ్ చేశారు.
“నేను ప్రజాపతి కుటుంబం సహా దేశంలోని ప్రతి బహుజనుడికి మద్దతు ఇస్తున్నాను. ఇది గౌరవం, న్యాయం, సమానత్వం కోసం పోరాటం. మేము ఈ పోరాటంలో గెలుస్తామని” రాహుల్ అన్నారు.