హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాబోయే 6 నెలల్లో జరిగే ఉప ఎన్నికపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ మాట్లాడుతూ… సీనియర్ నాయకులను పోటీ చేయడానికి బదులుగా, తన పోటీదారునికి టికెట్ ఇవ్వడంలో తన పార్టీ నాయకత్వం మరోసారి కుల సమీకరణకే ప్రాథాన్యమిస్తుందని అన్నారు.
ఈమేరకు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ…జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సుమారు ఆరు నెలల తర్వాత ఉంటుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తన ముస్లిం ఓటు బ్యాంకును బీఆర్ఎస్కు అమ్ముకుందని ఆయన ఆరోపించారు. అయితే, రానున్న ఉప ఎన్నికలో ఎంఐఎం నేతలు ముస్లిం ఓట్లను బీఆర్ఎస్కే విక్రయిస్తారా లేక కాంగ్రెస్ పార్టీకి అమ్ముతారా అనేది వేచి చూడాలని వ్యాఖ్యానించారు.
ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ పరిణామంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక అనివార్యమైంది.