హైదరాబాద్ : అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఎదుర్కొన్న విషాదకర ప్రమాదాన్ని జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్ అత్యంత దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఈ ఘటనను ఇటీవలి సంవత్సరాల్లో దేశంలో జరిగిన అత్యంత భయానకమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా పేర్కొన్నారు.
ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు డా. ఖాలిద్ ముబష్షిర్ హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ఈ దుర్ఘటనతో మొత్తం దేశం శోకసంద్రంలో మునిగిపోయిందని, దుఃఖ సమయంలో మేము బాధిత కుటుంబాలకు అండగా ఉన్నామని అన్నారు.
ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, దాని అసలైన కారణాలను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ఘోర ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డా. జఫర్ డిమాండ్ చేశారు. విమానయానం మరింత సురక్షితంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు, సాంకేతిక పర్యవేక్షణ, బాధ్యత ఉన్న వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరమని ఆయన సూచించారు.