హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్నా బేసిన్‌లో ప్రతిపాదించిన వివాదాస్పద గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్‌పై స్పష్టమైన వైఖరిని తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి N ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 19న కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్‌ను కలిసి బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని కోరారు. బనకచెర్ల సహజ న్యాయానికి విరుద్ధమని, తెలంగాణ ప్రయోజనాలకు హానికరమని ఆరోపించారు.
గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) అవార్డును, 2014 AP రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని AP ప్రభుత్వం ఉల్లంఘించిందని వారు ఆరోపించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పూర్వ-సాధ్యాసాధ్యాల నివేదికను తిరస్కరించాలని, న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు. తదనంతరం, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తన AP కౌంటర్ ఎన్ చంద్రబాబు నాయుడుతో చర్చలకు సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ వాదన వినిపించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును అడ్డుకోవడంపై క్యాబినెట్‌లో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశంపై అధికారులు, మంత్రులతో కూడిన కమిటీ నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసే ఛాన్స్ ఉంది.
అంతేకాదు గత BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతుల వివరాలను కోరిన PC ఘోష్ కమిషన్‌కు అందించిన ప్రాజెక్టుల వివరాలపై కూడా మంత్రివర్గం దృష్టి సారించే అవకాశం ఉంది. రైతుభరోసా నిధుల పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర క్రీడా పాలసీపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అలాగే ఈ కేబినెట్ సమావేశంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ. జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికల నిర్వహరణపై ఒక స్పష్టత కూడా ఈ భేటీ తర్వాత వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఆర్ఆర్ఆర్(రిజినల్ రింగ్ రోడ్డు) దక్షిణభాగం అలైన్మెంటుకు ఆమోదం తెలపనున్నారు.