న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్లో రెండు స్థానాలకు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆప్ రెండు స్థానాల్లో గెలిచింది.
ఎన్నికల కమిషన్ పంచుకున్న డేటా ప్రకారం, ఆప్ గుజరాత్ యూనిట్ మాజీ అధ్యక్షుడు ఇటాలియా, జునాగఢ్ జిల్లాలోని విసావదర్ స్థానంలో తన సమీప బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్‌ను 17,554 ఓట్ల తేడాతో ఓడించారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, 2007 నుండి విసావదర్ స్థానాన్ని గెలుచుకోలేదు.
డిసెంబర్ 2023లో అప్పటి ఆప్ శాసనసభ్యుడు భూపేంద్ర భయానీ రాజీనామా చేసి అధికార బీజేపీలో చేరిన తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది.
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా 10,637 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ అషుపై విజయం సాధించారు. అరోరా 35,179 ఓట్లు సాధించగా, అషు 24,542 ఓట్లు సాధించారు. బిజెపికి చెందిన జీవన్ గుప్తా 20,323 ఓట్లు సాధించగా, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి పరూప్కర్ సింగ్ ఘుమాన్ 8,203 ఓట్లు సాధించారు.
ఇక గుజరాత్‌లోని కాడి స్థానాన్ని అధికార బీజేపీ నిలుపుకోగా, పశ్చిమ బెంగాల్‌లోని కాలిగంజ్ అసెంబ్లీ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంది. ఇక కేరళలో నిలంబుర్ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదాన్ శౌకత్ అధికార ఎల్డీఎఫ్ అభ్యర్థిపై గెలుపొందారు. కాగా, జూన్ 19న ఐదు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.