హైదరాబాద్: రాచకొండ పోలీసులు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు ఉపశమనం కలిగించారు. ఏకంగా మూడున్నర కోట్ల విలువైన మొబైల్ ఫోన్‌లను రికవరీ చేశారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) పోర్టల్ సహాయంతో రెండు నెలల వ్యవధిలో 1130 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్‌లను వాటి స్వంతదారులకు పోలీసులు అప్పగించారు.
ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ల రికవరీ కోసం సీసీఎస్ ఎల్.బీనగర్, మల్కాజ్‌గిరి, భువనగిర్‌లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఐటీసెల్ సహకారంతో ఈ టీమ్‌లు పనిచేసి రెండునెలల్లో 1130 ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ సంవత్సరం, రాచకొండ పోలీసులు ఇప్పటివరకు 3694 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లైంది.
చోరీ అయిన మొబైల్ ఫోన్‌లను కొనడం లేదా అమ్మడంపై కూడా పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేశారు. అధీకృత బిల్లు లేకుండా మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు.
మొబైల్ ఫోన్‌లు చోరీకాకుండా ఉండేందుకు బలమైన భద్రతా పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని, ఫైండ్ మై డివైజ్ ఆప్షన్ (‘నా పరికరాన్ని కనుగొనండి’) ఫీచర్‌ను సెట్ చేసుకోవాలని, విలువైన సమాచారం కోల్పోకుండా నిరోధించడానికి డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయాలని కూడా సూచించారు.
అంతేకాదు మొబైల్ పోయినా లేదా చోరీ అయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు ప్రజలను కోరారు. ఎందుకంటే నేరస్థులు దొంగతనం చేసిన మొబైల్‌లను నేర కార్యకలాపాలు, సైబర్ నేరాలకు ఉపయోగించవచ్చని తెలిపారు.