న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కత్తులు దూసుకున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ సంఘటనను “ప్రజాస్వామ్యాన్ని అరెస్టు చేసిన” కాలంగా స్మరించుకున్నారు. అత్యవసర పరిస్థితిలో తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తగా గడిపిన సమయాన్ని వివరించే పుస్తకాన్ని ప్రచారం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం అదే పుస్తకాన్ని విడుదల చేస్తూ, వంశపారంపర్య రాజకీయాలను కాపాడటానికి విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన ‘25 ఏళ్ల బాలుడు’ (మోడీ) 2014లో దానిని కూల్చివేసిన వ్యక్తి అని అన్నారు.
కాగా, దేశ రాజధాని అంతటా ‘సంవిధాన్ హత్య దివస్’ పోస్టర్లు కనిపించగా, ఎమెర్జెన్సీ విధించిన రోజును బీజేపీ పాలిత రాష్ట్రాలు ‘సంవిధాన్ హత్య దివస్’గా జరుపుకోవాలని కోరింది. కాగా, దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర భాజపా నేతలు కాంగ్రెస్‌పై చేస్తోన్న విమర్శలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు.
మోదీ నేతృత్వంలో దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించారు. తమ పాలనా వైఫల్యాలను దాచిపెట్టడానికే ‘సంవిధాన్ హత్య దివస్’ పేరుతో భాజపా నేతలు నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీ నేతలు‘దేశ స్వాతంత్ర్యంలో, రాజ్యాంగ రూపకల్పనలో ఎటువంటి పాత్ర పోషించలేదు. వారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరస్కరించారు’. ఇటువంటి పార్టీ అత్యవసర పరిస్థితిని విధించిన 50 సంవత్సరాల తర్వాత ఎత్తి చూపుతున్నారని ఖర్గే అన్నారు.
“భారతీయ సంస్కృతి, మనుస్మృతి అంశాలు రాజ్యాంగంలో లేవని చెప్పుకుంటూ దానిని తిరస్కరించిన వారు – గత ఒక సంవత్సరం నుండి కాంగ్రెస్ ‘సంవిధాన్ బచావో యాత్ర’ నిర్వహిస్తున్నప్పుడు ఈ వ్యక్తులు అకస్మాత్తుగా జ్ఞానోదయం పొందారు. ఇది బిజెపిని కలవరపెట్టింది. అందుకే వారు 50 సంవత్సరాల క్రితం విధించిన అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడుతున్నారని ఖర్గే అన్నారు.
మరోవంక మిగతా ప్రతిపక్ష పార్టీలు మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం గత దశాబ్దంలో “అప్రకటిత అత్యవసర పరిస్థితి” విధించిందని ఆరోపించాయి.
మరోవంక అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారికి మోడీ వందనం చేస్తూ, వారి “సమిష్టి పోరాటం కారణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, తాజా ఎన్నికలకు పిలుపునిచ్చింది, కానీ వారు ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు.
“మన రాజ్యాంగంలోని సూత్రాలను బలోపేతం చేయడానికి, వికసిత్ భారత్ అనే మా దార్శనికతను సాకారం చేసుకోవడానికి కలిసి పనిచేయడానికి మా నిబద్ధతను కూడా మేము పునరుద్ఘాటిస్తున్నాము. మనం పురోగతి కొత్త శిఖరాలను అధిరోహిద్దాం. పేదలు, అణగారిన వర్గాల కలలను నెరవేర్చుకుందాం” అని ఆయన అన్నారు.