మహారాష్ట్ర: ముంబైలో జరిగిన పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం వివాదంలో చిక్కుకుంది, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా డబ్బు ఖర్చు చేసిందని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ వెండి ప్లేట్లపై అతిథులకు వడ్డించడం ద్వారా “విలాసవంతమైన” విందు ఇచ్చిందని మహారాష్ట్ర కాంగ్రెస్, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు.
అసలేం జరిగిందంటే… ముంబైలోని విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించిన రెండు రోజుల కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 600 మంది అతిథులు హాజరయ్యారు. అతిథులు ఒక్కొక్కరికి 550 చొప్పున అద్దెకు తీసుకున్న వెండి ప్లేట్లలో 5వేలరూపాయల విలువైన భోజనం వడ్డించారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది.
మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పార్టీ నాయకుడు విజయ్ వాడేట్టివార్ దీనిని “దుబారా ఖర్చు”గా అభివర్ణించారు. “రాష్ట్రం దాదాపు దివాలా అంచున ఉన్నప్పుడు, అంచనాల కమిటీ సభ్యులకు వెండి ప్లేట్లలో భోజనం వడ్డించాల్సిన అవసరం ఏమిటి?” అని ఆయన నాగ్‌పూర్‌లో విలేకరులతో అన్నారు.
ప్రతి అతిథి భోజనానికి దాదాపు రూ.5,000 ఖర్చు చేశారని, మరోవైపు, రైతులకు రుణమాఫీ నిరాకరించారు, బోనస్‌లు చెల్లించడం లేదని, అనేక సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో కోతలు విధించారని ఆయన ఆరోపించారు. కాగా, కేంద్ర రాష్ట్ర/యూటీ స్థాయిలో అంచనాల కమిటీ, సంబంధిత బడ్జెట్‌లు మరియు నిధుల ఖర్చులో ప్రతి పరిపాలనా విభాగానికి ఖర్చు అంచనాలను అంచనా వేస్తుంది.
మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. “వారు (అంచనాల కమిటీ ప్రతినిధి బృందం సభ్యులు) ఒక్కొక్కరికి రూ.550 విలువైన వెండి ప్లేట్‌లో వడ్డించిన రూ.5,000 భోజనంతో విందు చేసుకున్నారు. రాష్ట్ర అంచనాల కమిటీ పర్యటిస్తున్నప్పుడు ధూలే ప్రభుత్వ అతిథి గృహంలో దొరికిన డబ్బుతో ఖర్చు చేసిన నిధికి సంబంధం ఉందా?” అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు.. ఈ సమావేశంపై సామాజిక కార్యకర్త కుంభార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన..’రాజ పేష్వా శైలి వైభవంతో వెండి ప్లేట్లతో అతిథులకు భోజనం వడ్డించారు. తాజ్, ట్రైడెంట్ వంటి లగ్జరీ హోటళ్లలో అంచనాల కమిటీ సభ్యులు బస చేశారు. అంచనాల కమిటీ అంటే ప్రతీ రూపాయిని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం కోసం ఆలోచించాలి. కానీ, ఇలాంటి దుబారా ఖర్చులు చేయడమేంటి?. ఇలాంటి వారు.. ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. 5000 ఖర్చు చేసే భోజనం పెట్టి 27 లక్షలు ఖర్చు చేశారని మండిపడ్డారు.
అయితే, కాంగ్రెస్ నేతలు, పలువురు ఆరోపిస్తున్నట్టు అవి వెండి ప్లేట్లు కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేవలం వెండి పూత మాత్రమే ప్లేట్లకు పూసి ఉందని అంటున్నారు. అలాగే, భోజనం ఖర్చు కూడా 5000 కాదని తక్కువగా ఉందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర శాసనసభ నుండి స్పందనా లేదు.