హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. సమ్మెనుంచి అత్యవసర సేవలను మినహాయించారు. తమ సమస్యలపై రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడంతో 30వ తేదీ నుండి రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలల్లో నిరవధిక సమ్మెను ప్రారంభించనున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (T-JUDA) ప్రకటించింది.
నవంబర్ 2024 నుండి తాము ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శికి, ఆరోగ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదన్నారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ జూన్ 27 శుక్రవారం జూనియర్ వైద్యులు వైద్య ఆరోగ్య డైరెక్టర్‌కు లేఖ రాశారు.
జనవరి 2025 నుండి అమలులోకి వచ్చే జీవో నం. 59 ద్వారా స్టైపెండ్ పెంపును అమలు చేయకపోవడం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, వైద్యంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ప్రభావితం చేసే అధ్యాపకుల తీవ్ర కొరత, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో సక్రమంగా లేని స్టైపెండ్, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులో జాప్యం వంటి అంశాలను జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
అంతేకాదు క్లినికల్, పారా-క్లినికల్ ఫ్యాకల్టీ కొరత విద్యా నాణ్యతను,ఆచరణాత్మక శిక్షణను దెబ్బతీస్తోంది” అని వారు పేర్కొన్నారు. నాగర్ కర్నూల్, సిద్దిపేటలోని వైద్య కళాశాల భవనాలలో తగినంత సౌకర్యాలు లేకపోవడం, భద్రాద్రి-కొత్తగూడెంలోని విద్యార్థులకు నీరు, సరైన రవాణా లేకపోవడం, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో క్రీడా మౌలిక సదుపాయాలు లేకపోవడం విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభావితం చేస్తున్నాయని జూడాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు.
“సకాలంలో స్టైపెండ్‌లు, సరైన మౌలిక సదుపాయాలు, గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడం ఒక ప్రత్యేక హక్కు కాదు, అది ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రోగి సంరక్షణ పట్ల మా నిబద్ధతను చాటినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా సహనం నశించింది” జూనియర్ వైద్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆరోగ్య మంత్రితో రెండు సమావేశాలు జరిగినప్పటికీ, సమస్యలు పరిష్కారం కాలేదని జూనియర్ వైద్యులు తెలియజేశారు.