టెహ్రాన్: ఇరాన్ అయతుల్లా అలీ ఖమేనీని ” అవమానకరమైన మరణం” నుండి కాపాడానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ” ఆమోదయోగ్యం కాని” వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఖండించారు.
అణు “ఒప్పందం కోరుకోవడంలో అధ్యక్షుడు ట్రంప్‌కు నిజాయితీగా ఉంటే, అతను ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీని మర్యాదగా సంబోధించాలని, ఖమేనీని అభిమానించే లక్షలాది మంది మద్దతుదారులను బాధపెట్టడం ఆపాలని అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
ఈ యుద్దం సందర్భంగా ఇరాన్ ప్రజలు తమ ధైర్యాన్ని ప్రపంచానికి చూపారన్నారు. మా క్షిపణులతో వణికిన ఇజ్రాయెల్… చిన్న పిల్లాడు తన తండ్రి వద్దకు పరుగెత్తినట్టు మరోదారి లేక ట్రంప్ వద్దకెళ్లిందని ఎద్దేవా చేశారు.
ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై యునైటెడ్ స్టేట్స్ గత వారాంతంలో దాడులు చేసింది, అవి ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో ఏకాభిప్రాయం లేదు. ఆ దాడులతో, జూన్ 13న ప్రారంభమైన 12 రోజుల సంఘర్షణలో ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా దాడులలో పాల్గొంది.
కాగా, ఖమేనీ హత్యకు గురికాకుండా రక్షించామని, ఆయన కృతజ్ఞత లేనివాడని ఆరోపిస్తూ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘ఖమేనీ ఎక్కడ ఆశ్రయం పొందారో నాకు కచ్చితంగా తెలుసు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన అమెరికా, ఇజ్రాయెల్ దళాల చేతుల్లో ఆయన జీవితాన్ని ముగించనివ్వలేదు. నేను అతనిని అతి ఘోరమైన చావు నుంచి రక్షించాను. అయినా, నాకు ధన్యవాదాలు తెలపలేదు’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
ఈసందర్భంగా టెహ్రాన్ ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను సడలించే విషయాన్ని తాను ఇటీవల పరిశీలించానని తెలిపారు. అయినా, తనపై కోపం, ద్వేషంతో కూడిన ప్రకటనలు వస్తూనే ఉన్నాయని, అందుకే ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించే విషయాన్ని విరమించుకున్నానని వెల్లడించారు.
అయితే వచ్చే వారం మళ్లీ చర్చలు ప్రారంభమవుతాయని ట్రంప్ చెప్పిన తర్వాత, అమెరికాతో అణు చర్చలను తిరిగి ప్రారంభించబోమని ఇరాన్ తిరస్కరించింది.