న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనదారుల భద్రతను మరింత పెంచే దిశగా రవాణా మంత్రిత్వ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి అన్ని కొత్త టూవీలర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిబంధన 125 సీసీ ఇంజన్ సామర్థ్యం దాటిన టూవీలర్లకే పరిమితమైంది. ఇకపై ఇంజన్ సామర్థ్యంతో సంబంధంలేకుండా అన్ని స్కూటీలు, బైకులు, మోటార్ సైకిళ్లకు ఎబీఎస్ తప్పనిసరి కానుంది.
అంతేకాదు కొత్త బండి కొనుగోలు చేసే సమయంలో, టూవీలర్ డీలర్లు రెండు బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను వాహనదారులకు అందించడాన్ని కూడా మంత్రిత్వ శాఖ త్వరలో తప్పనిసరి చేయనుంది.
ఏబీఎస్‌తో ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధించడానికి, స్కిడ్డింగ్, క్రాష్ అయ్యే అవకాశాలను తగ్గించడానికి యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సాయపడుతుంది.
ప్రభుత్వ తాజా డేటా ప్రకారం, 2022లో భారతదేశంలో జరిగిన 1,51,997 రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 20 శాతం ద్విచక్ర వాహనాలే కారణమయ్యాయి.
మరోవంక ఏబీఎస్‌ను అన్ని కొత్త టూవీలర్లకు అమర్చాలన్న కేంద్ర నిబంధనను అమలు చేయడం వల్ల వీటి ధర పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఏబీఎస్‌ను తప్పనిసరి చేయడం వల్ల ఎంట్రీ లెవల్ టూవీలర్ల ధర కనీసం రూ.2వేలు పెరగవచ్చన్న అంచనాలున్నాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) అనేది సడన్‌గా బ్రేక్ వేసిన సమయంలో మోటార్ సైకిళ్లు, స్కూటర్ల చక్రాలు లాక్ కాకుండా నిరోధిస్తుంది.