ముంబయి: విద్యార్థులపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారన్న విమర్శల నేపథ్యంలో ఫడ్నవీస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఈ మేరకు పాఠశాలల్లో త్రీ-భాషా విధానంపై తీసుకొచ్చిన రెండు తీర్మానాలను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విధానం భవిష్యత్తుపై చర్చించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత… దీనిని ఎలా అమలు చేయాలనే విషయాన్ని పరిశీలించేందుకు నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని వేశామని, ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం త్రి భాషా విధానం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. అప్పటి వరకు, ఏప్రిల్ 16, జూన్ 17న జారీ చేసిన రెండు ప్రభుత్వ తీర్మానాలు రద్దు అవుతాయి.” తాము హిందీని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, వాస్తవానికి, ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తీసుకుందని సీఎం వెల్లడించారు.
ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో ఒక ప్రకటనలో ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా వెల్లడించింది. దీనిపై శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఎన్సీపీ (ఎస్పీ)ల ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ… ప్రభుత్వం మరాఠీపై దృష్టి సారిస్తుందని ప్రకటించారు. అలాగే ఇంగ్లీషును అంగీకరించిన ఉద్దవ్ థక్రే తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో త్రిభాషా విధానం అమలుపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న డాక్టర్ రఘునాథ్ మషేల్కర్ కమిటీ సిఫార్సులను ఉద్దవ్ థాక్రే అంగీకరించారని ఆరోపించారు.
సీఎం ఫడ్నవీస్ MNS చీఫ్ రాజ్ థాకరేను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. “ఆ సమయంలో రాజ్ థాకరే ఎక్కడా లేరు. ఆయన పార్టీ ప్రతిపక్షంలో చేరాక ఆయన వైఖరి ఎందుకు మారిందో అర్థం కావడం లేదన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ హిందీ భాష నేర్చుకోవాలని కోరుకున్నారని సీఎం ఫడ్నవీస్ అన్నారు.
శివసేన (UBT) నేతృత్వంలో ముంబై, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసనలో జూన్ 17నాటి తీర్మానం కాపీలను దహనం చేస్తామని చెప్పిన కొన్ని గంటల తర్వాత ఫడ్నవీస్ ప్రభుత్వం దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. తాను హిందీని వ్యతిరేకించడం లేదని, దానిని విద్యార్థులపై తప్పనిసరిగా రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని ఉద్ధవ్ థాకరే చెప్పారు.
ముంబైలో పౌర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, భాషా వివాదంలో విడిపోయిన థాకరే సోదరులు – ఉద్ధవ్, రాజ్‌లు – జూలై 5న ఈ అంశంపై నిరసన తెలపడానికి కలిసారు. అయితే సీఎం ఫడ్నవీస్ ఈ అంశంపై డాక్టర్ జాదవ్ నేతృత్వంలోని ప్యానెల్ ఏర్పాటు చేయడంతో నిరసన రద్దు చేసారు.