బెంగళూరు: భారత రాజ్యాంగ ప్రవేశికలో “సోషలిస్ట్”, “లౌకిక” అనే పదాలను చేర్చడాన్ని పునఃపరిశీలించాలని పిలుపునిచ్చిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలేపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసి) లీగల్ సెల్ కర్ణాటక యూనిట్ అధికారికంగా ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు లీగల్ సెల్ చైర్మన్ శ్రీధర్, కో-చైర్మన్ సమ్రుధ్ హెగ్డే, ఇతర ఆఫీస్ బేరర్లు,న్యాయవాదులు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జూన్ 26న అత్యవసర పరిస్థితిని గుర్తుచేసుకుంటూ జరిగిన బహిరంగ సభలో హోసబాలే చేసిన వ్యాఖ్యల మేరకు ఈ ఫిర్యాదు చేసారు. ఫిర్యాదుతో పాటు ఒక లేఖను కూడా శ్రీధర్ జత చేశారు. ఈ లేఖలో రాజకీయంగా సున్నితమైన కార్యక్రమంలో ఒక సంస్థ ఉన్నత స్థాయి సిద్ధాంతకర్త చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం భావజాల వ్యాఖ్యానం మాత్రమే కాదు.” ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేకెత్తించేలా ఉన్నాయని, కాబట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
“రాజ్యాంగ విలువలను బహిరంగంగా క్షీణింపజేయడానికి చేసే ఇటువంటి ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎవరూ రాజ్యాంగానికి అతీతులు కారని, రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను లేదా రాజ్యాంగ సూత్రాలను నిర్వీర్యం చేయడాన్ని బహిరంగంగా సమర్థిస్తే… కేసులు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టమైన సందేశం పంపాలి” అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ సందోష్ కుమార్ ..ఆర్ఎస్ఎస్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్‌కు ఒక లేఖ రాశారు… హోసబాలే వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత భారత రాజ్యాంగం ప్రాథమిక విలువలుగా లౌకికవాదం, సోషలిజం కీలక పాత్రను గుర్తించాలని కోరారు.
కుమార్ తన లేఖలో, ఒక సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇటీవల చేసిన ప్రకటనలను విమర్శించారు, ఈ సూత్రాలు భారతదేశ సమాజానికి చాలా ముఖ్యమైనవని వాదించారు.
రాజ్యాంగాన్ని అధికారికంగా అంగీకరించాలని, దాని స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను నిలిపివేయాలని కూడా ఆయన ఆర్ఎస్ఎస్‌ను కోరారు.
“ఈ సూత్రాలు ఏకపక్ష చొప్పించడం కాదు, భారతదేశంలోని అణగారిన వర్గాల జీవిత అనుభవాల నుండి, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి అనేక మంది నాయకుల దార్శనిక ఊహ నుండి ఉద్భవించిన ఆదర్శాలు. మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో, లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వాన్ని నిర్ధారిస్తుంది, అయితే సోషలిజం మన పౌరులలో ప్రతి ఒక్కరికీ న్యాయం, గౌరవాన్ని వాగ్దానం చేస్తుంది. ఈ విలువలను అపహాస్యం చేయడం లేదా తిరస్కరించడం అంటే మన దేశం వలస పాలన నుండి విముక్తి పొందిన సమయంలో భారత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తిరస్కరించడమే” అని కుమార్ రాశారు.
కాగా, అత్యవసర పరిస్థితి 50వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 26న, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హోసబాలే భారత రాజ్యాంగ ప్రవేశికలో “సోషలిస్ట్”, “లౌకిక” అనే పదాలను చేర్చడాన్ని పునఃపరిశీలించాలని సూచించిన విషయం తెలిసిందే.