నిత్యం రోగుల ప్రాణాలు కాపాడేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్న వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నిజంగా డాక్టర్ అందిస్తున్న సేవలు మహోన్నతమైనవి. ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న వైద్యులందరికీ మా శుభాభినంనలు. నిత్యం రోగ పీడితులకు వైద్యం అందిస్తూ వాళ్లకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తూ, పలు వ్యాదులు, ఎన్నో ప్రమాదాలబారిన పడి చావుబ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడే వారికి సకాలంలో వైద్యమందించి వారికి ప్రాణ భిక్ష పెట్టేది కేవలం వైద్యులు మాత్రమే. అందుకే డాక్టర్లను ప్రాణదాతలంటారు.
ఇంతటి మహోన్నతమైన, పవిత్రమైన వైద్య వృత్తికి కొంతమంది డాక్టర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కళంకం తెచ్చిపెడుతున్నారు. సేవాదృక్పథంతో వైద్యవృత్తిని భావించి ఎంతోమంది ఆదర్శప్రాయమైన డాక్టర్లు మనదేశంలో గడించారు. కానీ నేడు కొంతమంది వైద్యులు కేవలం డబ్బు సంపాదనే పరమావధిగా వైద్య వృత్తిని చేపడుతున్నారు. దీనికి కారణాలూ లేకపోలేదు. మన విద్యావ్యవస్థే దీనికి ప్రధాన కారణం. లక్షలు, కోట్ల రూపాయలతో వైద్య విద్యను చదువుకొని తిరిగి చదువు అయిపోయాక వాటిని తిరిగి సంపాదించుకునే పనిలో తమ పవిత్రమైన వైద్య వృత్తికి అన్యాయం చేస్తున్నారు.
ఇక కార్పొరేట్ ఆసుపత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోగిని నిలువెల్లా దోచుకుంటున్నాయి. అవసరమున్నా లేకున్నా శస్త్ర చికిత్సలు చేసి నిలువుదోపిడీ చేసిన సంఘటనలు మనం పత్రికల్లో, టీవీల్లో చూస్తున్నాము. చెప్పుకుంటూ పోతే చాంతాడంత కార్పొరేట్ పాపాలు రాయవచ్చు. నేడు అన్నిరంగాలనూ నైతిక సంక్షోభంలో కూరుకుపోయాయి. నైతిక విలువలు మచ్చుకైనా కానరావడం లేదు. ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే వైద్య రంగానికీ ఈ రోగం పట్టుకుంటే బీదబిక్కి జనానికి వైద్యం అందేదెలాగా? ఇప్పుడు వైద్యరంగానికి చికిత్స చేయకపోతే సమాజమంతా అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది.
వైద్యులకు కొన్ని సలహాలు..
‘‘నేను మూడు వందల సంవత్సరాలపాటు ఎన్నో రోగాలకు చికిత్స చేశాను. ఇన్ని వందల సంవత్సరాల నా వైద్య అనుభవంలో నాకు బోధపడిందేమిటంటే.. మనిషి రోగానికి ప్రేమ, ఆదరణకు మించిన ఔషధం లేదని నాకు బోధపడింది.’’ ఎవరో అడిగారు ; ఒకవేళ ఈ ఔషధాలు కూడా పనిచేయకపోతేనో?’’ ఆయన చిరునవ్వు నవ్వుతూ ‘‘ప్రేమ పాళ్లు పెంచండి’’ అని బదులిచ్చారు. – లుక్మానె హకీం
లుఖ్మానె హకీం సుప్రసిద్ధ వైద్యులు. ఆయన పేరుతో ఖుర్ఆన్ లో ఒక అధ్యయమే ఉంది. మూడు వందల సంవత్సరాల పాటు ఎన్నో రోగాలకు చికిత్స చేశారాయన. ఆయన తన వైద్య అనుభవాన్ని గురించి చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్లు నిజం. రోగి రోగం కుదర్చాలంటే ప్రేమపూర్వకమైన స్పర్శకు మించిన ఔషధం లేదు.
డాక్టర్లు రోగితో ప్రేమగా, స్నేహపూర్వకంగా మాట్లాడితే సగం రోగాన్ని నయం చేయవచ్చన్నది లుక్మానె హకీం చెప్పిన దాని సారాంశం. ఒకప్పుడు రోగులు డాక్టర్లతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. సేవా దృక్పథంతో వైద్య సేవలందించేవారు. కానీ నేడు వైద్యవృత్తి డబ్బు సంపాదనా మార్గంగా మారిపోవడం దురదృష్టకరం. వైద్యుల్లో నైతిక విలువలు కొరవడితే సమాజానికే జబ్బు చేస్తుంది. వైద్యానికి, వైద్యులకూ ఇస్లామ్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది ఇస్లామ్ ధర్మం. ఒక ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవాళి ప్రాణాలు కాపాడినదానితో సమానంగా పేర్కొంటోంది ఖుర్ఆన్. రోజూ ఎంతోమంది ప్రాణాలు కాపాడే డాక్టర్లు ఎంతటి అదృష్టానికి నోచుకుంటున్నారో అంచనావేయలేము.
దైవప్రవక్త వైద్యుని అవసరాన్ని గురించి ఒక విషయాన్ని చెప్పారు. ‘‘ఒకసారి దైవ ప్రవక్త ఇబ్రాహీం (అలై) దైవాన్ని ‘‘ప్రభూ వ్యాధి ఎవరి తరపు నుంచి వస్తుంద’’ని అడిగారు. అప్పుడు సృష్టికర్త తరపు నుంచి అని సెలవిచ్చాడు అల్లాహ్. మళ్లీ ఆయన ‘‘మందు ఎవరి తరపు నుంచి?’’ అని ప్రశ్నించారు. ‘‘మందు కూడా నా తరపు నుంచే’’ అని సమాధానమిచ్చాడు దేవుడు. ‘‘అలాంటప్పుడు వైద్యుని అవసరమేంటి?’’ అన్నారు ఇబ్రాహీం (అలైహి). ‘వైద్యుని చేత మందు ఇవ్వబడుతుంది’ అని సెలవిచ్చారు.
వైద్యులకు ఎంతటి ప్రాధాన్యత ఉందో, వైద్య వృత్తి ఎంతటి ఉన్నతమైనదో 14వందల సంవత్సరాల క్రితమే ముహమ్మద్ ప్రవక్త (స) చాటి చెప్పారు. వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు చేయడం, రోగ పీడితులను పరామర్శించడం ఇస్లామ్ ధర్మం ఎంతో పుణ్యప్రదంగా నొక్కి చెప్పింది. రోగిని పరామర్శించడం దైవాన్ని పరామర్శించడంతో సమానంగా పేర్కొన్నారు మహాప్రవక్త ముహమ్మద్ (సఅసం).
‘‘ప్రళయ దినాన దేవుడు, ఆదమ్ కుమారా, నేను జబ్బు పడ్డాను. కానీ నీవు నన్ను పరామర్శించలేదు అంటాడు. అప్పుడు దాసుడు ‘‘దేవా, నీవు సర్వ విశ్వానికి ప్రభువు, నేను ఎలా నిన్ను పరామర్శించగలను’’ అని విన్నవించుకుంటాడు. అప్పుడు దేవుడు ఇలా అంటాడు; నా ఫలానా దాసుడు రోగపీడితుడయి ఉంటే నీవు అతడిని పరామర్శించలేదు. అతడిని పరామర్శించడానికి వెళ్లి ఉంటే అక్కడ నీవు నన్ను కానగలిగి ఉండేవాడివి.
రోగ పీడితుడిని పరామర్శిస్తేనే దేవుడిని పరామర్శించినంత పుణ్యం లభిస్తే ఇక రోగితో ప్రేమపూర్వకంగా మాట్లాడి రోగికి సరైన చికిత్స చేసి స్వస్థత చేకూరిస్తే దేవుడు ఇంకెంత ప్రసన్నుడవుతాడో, అలాంటి వైద్యుడిపై ఎన్నెన్ని శుభాలు కురిపిస్తాడో ఒక్కసారి ఆలోచించండి.
డబ్బుకంటే కూడా మనిషి ప్రాణానికి, వైద్యసేవకు ప్రాధాన్యతనిచ్చిన వైద్యులు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన దాఖలాలు మనం చాలా సందర్భాల్లో, చాలా చోట్ల వినే ఉన్నాం. అలాంటి డాక్టర్లే పదిమంది మన్ననల్ని, ఆశీసుల్ని పొందుతారు. అలాంటి డాక్టర్లకే మనశ్శాంతి లభిస్తుంది. అంతేకానీ డబ్బే పరమావధిగా భావించి వైద్యం చేసే డాక్టర్లకు మనశ్శాంతి కరువవుతుంది. ఎంత సంపాదించినా తృప్తి లభించదు.
రోగులతో కాస్తంత ప్రేమగా మాట్లాడండి..
డాక్టర్ గారూ రోగులను నవ్వుతూ పలకరించండి. నేడు చాలామంది డాక్టర్లకు అసలు రోగి చెప్పేది వినే ఓపిక ఉండటం లేదు. ఎంత ఎక్కువ మంది పేషెంట్లను చూస్తే అంత డబ్బు దండుకోవచ్చన్నది కొంతమంది డాక్టర్ల దృక్పథమైంది. రోగి చెప్పింది విని వినకుండా ఖరీదైన మందులు రాసిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. కేవలం మందులతోనే వ్యాధి నయమవ్వదని ఎన్నో పరిశోధనలు తేల్చి చెప్పాయి.
ముందు రోగి చెప్పిన సమస్యను శ్రద్ధగా వినాలి. రోగికి ధైర్యాన్ని నూరిపోయాలి. ప్రేమపూర్వక స్పర్శతో రోగికి ఉపశమనం కలిగించాలి. రోగికి మానసికంగా ధైర్యం చెప్పాలి. ఎందుకంటే రోగి డాక్టర్ ను అన్నీ తానుగా భావిస్తాడు. డాక్టర్ చెప్పింది వేదవాక్కుగా భావిస్తాడు. దీంతో ఎంతటి మొండి రోగమైనా నయమవుతుంది. రెండోసారి వచ్చిన రోగికి ‘‘ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అని అడగాలి. ఆ తరువాత అతనికి ధైర్యం చెబుతూ ’’భయపడవలసిన పనిలేదు. దేవుడు తలిస్తే ఈ వ్యాధి త్వరలోనే నయం అవుతుందనే భరోసా ఇవ్వాలి.
(జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా)
- ముహమ్మద్ ముజాహిద్, 9640622076