వాషింగ్టన్ : గాజాలో 60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేసేందుకు రూపొందించిన షరతులను ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి తాము పని చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో తెలిపారు.
ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహించే అధికారుల ద్వారా దీనికి సంబంధించిన పత్రాలను అందిస్తారని చెప్పారు. అలాగే గాజాలో ఇజ్రాయెల్‌తో 60 రోజుల కాల్పుల విరమణకు “తుది ప్రతిపాదన”కు అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మద్దతుగల హమాస్ ఉగ్రవాదులను కోరారు.
సోషల్ మీడియా పోస్ట్‌లో, ట్రంప్ తన ప్రతినిధులు గాజా గురించి ఇజ్రాయెల్ అధికారులతో “సుదీర్ఘమైన, ఫలవంతమైన” సమావేశాన్ని నిర్వహించారని చెప్పారు.
కాగా, వచ్చేవారం ఇజ్రాయెల్ ప్రధాని అమెరికా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. గాజాలో శతృత్వాలకు ముగింపు పలకాలని నెతన్యాహు భావిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
“మధ్యప్రాచ్యం శ్రేయస్సు కోసం హమాస్ ఈ ఒప్పందానికి అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంతకంటే మంచి అవకాశం రాదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారతాయి” అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
https://truthsocial.com/@realDonaldTrump/114780321031653396
అంతకుముందు ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, వచ్చే వారం నాటికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఆయన సమావేశం కానున్నారు. గాజాలో త్వరితగతిన కాల్పుల విరమణ అవసరాన్ని నెతన్యాహు వద్ద తాను గట్టిగా ప్రస్తావిస్తానని, అయితే నెతన్యాహు కూడా అదే కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.
యుద్ధాన్ని ముగించడానికి ఒప్పందం కుదిరితే గాజాలో మిగిలిన బందీల విడుదలకు హమాస్ సిద్ధంగా ఉందని, హమాస్‌ను నిరాయుధులను చేసి కూల్చివేస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ తన ఆయుధాలను విడిచిపెట్టడానికి నిరాకరిస్తుంది.
ఇజ్రాయెల్ గణాంకాల ప్రకారం, అక్టోబర్ 7, 2023న హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపి 251 మందిని బందీలుగా తీసుకెళ్లాక గాజాలో యుద్ధం ప్రారంభమైంది. అయితే ఇరుపక్షాలు పంతం వీడకపోవడంతో చర్చలు ముందుకు సాగడంలేదు.
అమెరికా 60 రోజుల కాల్పుల విరమణను, పాలస్తీనియన్ ఖైదీలు, ఇతర పాలస్తీనియన్ల అవశేషాలకు బదులుగా సగం మంది బందీలను విడుదల చేయాలని ప్రతిపాదించింది.
ఈ వారం ప్రారంభంలో ఇజ్రాయెల్ అమెరికా ప్రతిపాదించిన 60 రోజుల కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి అంగీకరించిందని, అమలు బాధ్యతను హమాస్‌పై మోపిందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ అన్నారు.
ట్రంప్, అతని సహాయకులు ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుండి ఏదైనా లాభం పొందాలని, గాజాలో శాశ్వత కాల్పుల విరమణను పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.