-9 ఏళ్ల క్రితం నాటి కేసు మూసివేతకు కోర్టు అంగీకారం
-అదృశ్యమైన కొడుకు కోసం ఓ తల్లి న్యాయ పోరాటం
న్యూఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి నజీబ్ 9 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ అతడి జాడ లేదు. నజీబ్ ఎక్కడ ఉన్నాడు? అనే ప్రశ్నకు సమాధానం లభించక అతడి తల్లి మౌనంగా బాధ పడుతుండగా, ఈ కేసు ముగించమని ఢిల్లీ పోలీసులు, సీబీఐ కోర్టును కోరాయి. చివరికి ఢిల్లీ లోని రౌజ్ అవెన్యూ కోర్టు సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికను అంగీకరిస్తూ కేసు మూసివేసేందుకు అనుమతి ఇచ్చింది.
కాగా, సీబీఐ 2018లో తన క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. అందులో తాము నజీబ్ కోసం వెతగ్గా స్పష్టమైన ఆధారం ఒక్కటీ లభించలేదని పేర్కొంది. సోమవారం కోర్టు ఈ నివేదికను అంగీకరించింది. కోర్టు ఈ కేసు మూసివేతకు అనుమతించడంపై నజీబ్ తల్లి ఫాతిమా నఫీస్ తీవ్రంగా స్పందించారు. సీబీఐ, ఢిల్లీ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. “న్యాయం కోసం అవసరమైతే నేను సుప్రీం కోర్టుకు వెళ్లడానికైనా వెనకాడను” అని ఆమె తెలిపారు. “నా కుమారుడికి న్యాయం జరిగే వరకు, నా చివరి శ్వాస వరకు పోరాడుతాను” అని ఆమె స్పష్టం చేశారు.
“నా కుమారుడు 9 సంవత్సరాలుగా కనిపించడం లేదు. మొదటి రోజు నుంచే ఢిల్లీ పోలీసులు, సీబీఐ ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. కానీ కోర్టు మాత్రం దర్యాప్తుకు తగిన ఆధారాలు లేవన్న సీబీఐ వాదనను అంగీకరిస్తూ కేసును మూసి వేసేందుకు అంగీకరించింది. ఈ రోజు వరకూ నా కుమారుడిపై దాడి చేసిన ABVP విద్యార్థులను అరెస్ట్ చేయలేదు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“నా కుమారుడి గురించి ఎన్నో పుకార్లు, అబద్ధాలు వ్యాపించాయి. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ వీడియోలను, కథనాలను డిజిటల్, సోషల్ మీడియాలో నుండి తొలగించారు. కానీ వాస్తవం ఏమిటంటే, ఇంతటి పెద్ద పెద్ద దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ కూడా నజీబ్ ఎక్కడ ఉన్నాడో ఇప్పటివరకు చెప్పలేకపోయాయి” అని ఆమె అన్నారు.
“ఈ తొమ్మిదేళ్లలో వ్యవస్థ మమ్మల్ని మౌనంగా ఉండేలా చేయాలని చూసినప్పుడు, JNU, AMU, జామియా యూనివర్సిటీలతో పాటు దేశంలోని పలు కళాశాలల విద్యార్థులు మాతో కలిసి నిలబడ్డారు. వాళ్లే రోడ్డులపై లాఠీఛార్జీలను ఎదుర్కొన్నారు, మా తరపున గళమెత్తారు. ఇదే మాకు ధైర్యం ఇచ్చింది” అని ఆమె అన్నారు.
“ఇంత మంది తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు నా ఆశ వదులుకుంటాను? నేను ఎలా బలహీన పడతాను? నాకు నా కొడుకు తిరిగి కావాలి. న్యాయం కోసం నేను ఏ కోర్టులో అయినా పోరాడతాను. నా చివరి శ్వాస వరకు పోరాడుతాను” అని ఆమె అన్నారు.
“ఈ పోరాటంలో రాబోయే రోజుల్లో మరింత మంది నాతో చేరతారని నాకు ఆశ ఉంది. ఈ పోరాటం కేవలం నా కుమారుడి కోసం కాదు, తన బిడ్డకు న్యాయం కోరే ప్రతి తల్లి కోసం కూడా. అవసరమైతే నేను సుప్రీం కోర్టుకు వెళ్తాను” అని నజీబ్ తల్లి ఫాతిమా నఫీస్ ప్రకటించారు.
2016లో ఏం జరిగింది?
ఫాతిమా నఫీస్ చెప్పిన ప్రకారం, ఆమె కుమారుడు సెమిస్టర్ విరామం తర్వాత 2016 అక్టోబర్ 13న JNUకి తిరిగి వచ్చాడు. అక్టోబర్ 15 రాత్రి అతను తన తల్లి ఫాతిమాకు ఫోన్ చేసి, “ఏదో తప్పు జరిగింది” అని చెప్పాడు. హాస్టల్లోనే ఉండమని.. తాను అక్కడికి వస్తానని ఆమె కొడుక్కి ధైర్యం చెప్పారు. పోలీస్ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నదాని ప్రకారం, నజీబ్ రూమ్మేట్ ఖాసిమ్ చెప్పిన దాని ప్రకారం… నజీబ్‌పై కొందరు దాడి చేయడంతో అతను గాయపడ్డాడు.
కొడుకుకు అండగా నిలవడానికి నసీఫ్ ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నుండి ఢిల్లీకి వచ్చారు. కానీ ఆమె మహీ మాండవి హాస్టల్‌లోని రూమ్ నెం. 106కు వెళ్లినప్పుడు నజీబ్ అక్కడ కనిపించలేదు. అప్పటి నుండి అతను అదృశ్యమయ్యాడు. చివరిగా తెలిసిన సమాచారం ప్రకారం ABVP కార్యకర్తలు అతని రూమ్‌కు వచ్చి విరాళం అడిగారు. ఈ విషయమై వారికి అతడితో వాదన జరిగింది. ఈ వాదన దాడికి దారి తీసి చివరకు అతను అదృశ్యమయ్యే దశకు వెళ్లింది.
ముహమ్మద్ ముజాహిద్