వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు కలలుకన్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం లభించింది. మొన్న సెనేట్ ఓకే చేసిన ఈ బిల్లుకు నేడు అమెరికా కాంగ్రెస్ కూడా ఎస్ అంది. గురువారం రోజు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 218-214 ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ దీనిని ఆమోదించింది. ఇది ట్రంప్‌కు అతిపెద్ద విజయం. ఈ చరిత్రాత్మక బిల్లుకు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన నేడు ట్రంప్ సంతకం చేయనున్నారు.
ట్రంప్ సంతకం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారబోతుంది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్ తీసుకు వచ్చారు. అయితే 2017లో ప్రవేశ పెట్టిన ఈ బిల్లు ద్వారా 4.5 ట్రిలియన్ డాలర్ల పన్ను కోతలను ఇది శాశ్వతం చేస్తుంది. అలాగే టిప్పులపై పన్నులను రద్దు చేయడం వంటి కొత్త పన్ను రాయితీలను కూడా ప్రవేశపెట్టారు.
అలాగే SALT (State And Local Tax) మినహాయింపు పరిమితిని 10,000 డాలర్ల నుంచి 40,000 డాలర్లకు పెంచారు. ఈ కొత్త మినహాయింపులు తదుపరి 10 సంవత్సరాల్లో ఫెడరల్ బడ్జెట్ లోటును 3.4 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఫుడ్ స్టాంప్ పథకంలో మార్పులు చేశారు. కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే పని చేయగల వ్యక్తులకు వయో పరిమితిని 54 నుంచి 64 సంవత్సరాలకు పెంచారు.
తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉన్న మెడికెయిడ్ ఆరోగ్య పథకంలో భారీ కోతలు విధించారు. కొత్తగా విధించిన పని నిబంధనలతో, సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికెయిడ్ సేవలు నిలిపివేయడం, లింగ మార్పు చికిత్సలకు నిధులు నిలిపివేయడం వంటి చర్యలు బిల్లులో పొందుపరిచారు.
డెమొక్రాట్లు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు, దీనిని పేదలు నిధులు సమకూర్చే ‘ధనవంతులకు పన్ను బహుమతి’ అని అభివర్ణించారు. హౌస్ డెమోక్రటిక్ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 8 గంటల 44 నిమిషాల రికార్డు ప్రసంగం చేశారు.
ఈ చట్టం బరాక్ ఒబామా తీసుకొచ్చిన అఫర్డబుల్ కేర్ చట్టం, జో బిడెన్ వాతావరణ సంస్కరణల భాగాలను వెనక్కి తీసుకుంటుంది. ఈ బిల్లు… లోటును $3.3 ట్రిలియన్లు పెంచుతుందని, దాదాపు 12 మిలియన్ల అమెరికన్లను బీమా లేకుండా చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా, ఈ బిల్లు ఆమోదం పొందడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా సోషల్ టూత్ వేదికగా ట్రంప్ స్పందించారు. ఈ బిల్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని, సంక్షేమ పథకాల్లో మోసాన్ని తగ్గిస్తుందని ట్రంప్ అన్నారు. అత్యంత ప్రధానమైన బిల్లుల్లో దీన్ని ఒకటిగా పేర్కొన్నారు. అమెరికాప్రపంచంలోనే హాటెస్ట్ దేశమని వ్యాఖ్యానించారు.