రియోడిజనీరో: పహల్గామ్ ఊచకోతను ఖండిస్తూ బ్రిక్స్ దేశాలకు చెందిన 11 మంది నాయకులు ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఉగ్రవాదాన్ని “నేరపూరితమైనది, సమర్థించలేనిది”అని బ్రెజిల్ రాజధాని రియో డి జనీరో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో అభివర్ణించారు.
ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ‘రియో డీ జెనీరో డిక్లరేషన్’ను సభ్యదేశాలు విడుదల చేశాయి.
క్రాస్ బార్డర్ టెర్రిరిజంతోపాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ, ఆశ్రయం కల్పించడాన్ని ఖండించారు. అయితే ఈ తీర్మానంలో ఎక్కడా పాకిస్థాన్ పేరు ప్రస్థావించకపోవడం గమనార్హం. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, పాకిస్తాన్‌ను నేరుగా విమర్శించకుండా బ్రిక్స్ ప్రకటనపై భారతదేశం సంతకం చేసింది.
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా నిర్వహించిన 17వ శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్ నాయకులు “రియో డి జనీరో డిక్లరేషన్”ను ఆమోదించారు. కానీ పాకిస్తాన్‌తో నేరస్థుల సంబంధాలపై మౌనం వహించారు. దాడి జరిగిన ప్రదేశం భారతదేశ భూభాగంలో ఉందని గుర్తించడం కూడా మానేశారు.
కాగా, రియో డి జనీరోలో జరిగిన ఈ కూటమి శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఏప్రిల్ 22న భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్‌లో జరిగిన మారణహోమాన్ని ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫోర్స్ భారతదేశంలో జరిగిన తాజా ఉగ్రవాద దాడికి బాధ్యత వహించింది.
“ఉగ్రవాదం నేడు మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాలు. భారతదేశం ఇటీవల క్రూరమైన ఉగ్ర దాడిని ఎదుర్కొంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి భారతదేశం ఆత్మ, గౌరవంపై ప్రత్యక్ష దాడి” అని బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ అన్నారు, “ఈ దాడి భారతదేశానికి మాత్రమే కాదు, మొత్తం మానవాళికి దెబ్బ. ఈ దుఃఖ సమయంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
ఉగ్రవాదాన్ని ఖండించడం అనేది కేవలం సౌలభ్యం కోసం కాకుండా సూత్రప్రాయమైన విషయం అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “ఎక్కడ లేదా ఎవరిపై దాడి జరిగిందనే దానిపై మన ప్రతిస్పందన ఆధారపడి ఉంటే, అది మానవత్వానికే ద్రోహం అవుతుంది” అని ఆయన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో అన్నారు.
బ్రిక్స్‌లో భారతదేశం, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా ఉన్నాయి.