న్యూఢిల్లీ: బీహార్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)లో ఆధార్ కార్డులు, ఓటరు ఐడి కార్డు,రేషన్ కార్డులను ఆమోదయోగ్యమైన పత్రాలుగా పరిగణించాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి సూచించింది.
జూన్ 24న ECI ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం… ఆధార్, ఓటరు ID కార్డులను మినహాయించి పౌరసత్వాన్ని నిరూపించడానికి 11 నిర్దిష్ట పత్రాలను జాబితా చేసింది.
జూన్ 24న వచ్చిన జాబితా వివరణాత్మకమైనది, సమగ్రమైనది కాదని ECI సమర్పించిన విషయాన్ని కోర్టు నమోదు చేసింది. “కాబట్టి, మా ప్రాథమిక దృష్టిలో… న్యాయం కోసం ECI ఆధార్ కార్డు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డు, రేషన్ కార్డును కూడా పరిగణనలోకి తీసుకుంటుంది” అని బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది.
అయితే, ఇది తప్పనిసరి ఆదేశం కాదని కోర్టు స్పష్టం చేసింది. తగిన హేతుబద్ధతతో పత్రాలను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి ECI విచక్షణాధికారాన్ని కలిగి ఉంది. “ఆధార్‌ను విస్మరించడానికి మీకు మంచి కారణం ఉంటే, మీరు అలా చేయండి – అయితే అందుకు గల కారణాలు వెల్లడించాలని జస్టిస్ ధులియా వ్యాఖ్యానించారు.
జూలై 28, 2025న తదుపరి విచారణను కోర్టు షెడ్యూల్ చేసింది, జూలై 21 నాటికి ECI తన కౌంటర్-అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రాతినిధ్యం వహించిన పిటిషనర్లు, ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 1 వరకు గడువులోపు ఉన్నందున, మధ్యంతర స్టే కోసం ఒత్తిడి చేయకూడదని నిర్ణయించుకున్నారు.
ఇదే అంశంపై గురువారం ఉదయం జరిగిన విచారణలో కొన్ని ప్రశ్నలు సంధించింది. “ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పు లేదు. అయితే.. ఇక్కడ సమస్యంతా చేపడుతున్న సమయం.. దాని చెల్లుబాటు గురించే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక వ్యక్తి ఓటును కోల్పోతే.. దాని గురించి అడిగేందుకు సదరు వ్యక్తికి సమయం ఉండదు. ఆ సవరించిన జాబితాను సవాలు చేసేందుకు వీలు ఉండదు.
అలాగే ఈ ప్రక్రియ నిర్వహించడానికి ఈసీకి ఉన్న అధికారం.. ఈ సవరణ ప్రక్రియ చెల్లుబాటు.. నిర్వహిస్తున్న సమయంపై వివరణ ఇవ్వాలి” అని ఆదేశించిన సంగతి తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల క్రితం ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. ఈ క్రమంలో మరోసారి సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. ఎన్నికల సంఘం ఎంచుకున్న సమయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.