పచ్చదనం ప్రచారానికి నడుం బిగించిన కోయంబత్తూర్ చిన్నారులు…
తమిళనాడులో మొట్టమొదటి పిల్లల ప్రెస్ మీట్ కు సర్వత్రా ప్రశంసలు..
నేటి బాలలే రేపటి బాధ్యత గల పౌరులు’ అనే కొత్త నానుడిని కోయంబత్తూర్ ముస్లిం విద్యార్థులు నిజం చేశారు! పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని చాటి చెప్పారు. అందుకోసం ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యతను చిన్నారులు తమ భుజ స్కంధాలపై వేసుకొన్నారు. మట్టిలో చేతులు పెట్టి.. చిట్టి పొట్టి మొక్కలను నాటుదామని… భారత దేశాన్ని హరిత నిలయంగా మార్చి కాలుష్యాన్ని తరిమేద్దామని పిలుపునిచ్చారు.
తమిళనాడులో మొట్టమొదటిసారిగా మొత్తం పిల్లలే నిర్వహించిన ప్రెస్ మీట్ గురువారం విజయవంతమైంది. ‘‘జర్నలిస్టులను కలవండి” పేరుతో కోయంబత్తూర్ ప్రెస్ క్లబ్లో ఈ సమావేశాన్ని జమాత్-ఎ-ఇస్లామీ హింద్ (JIH) అనుబంధ బాలల విభాగమైన చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (CIO) నిర్వహించింది. “మట్టిలో చేతులు – హృదయంలో భారత్!” అనే జాతీయ స్థాయి మొక్కలు నాటే కార్యక్రమ ప్రచారంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లల్లో సామాజిక అవగాహనను, నాయకత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటైంది. పిల్లలు నేరుగా పాత్రికేయులతో ముచ్చటించిన తీరుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ సమావేశానికి కోయంబత్తూర్ CIO జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి జైనబ్ అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేశారు. CIO కోయంబత్తూర్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి నబీలా జర్నలిస్టులకు CIO చేపడుతున్న విద్య, సామాజిక కార్యక్రమాల ప్రభావం గురించి వివరించారు. “మట్టిలో చేతులు – హృదయంలో భారత్!” కార్యక్రమ ప్రాముఖ్యతను, దాని సందేశాన్ని వారికి వివరించారు.
ఈ కార్యక్రమం పిల్లల నాయకత్వ నైపుణ్యాలను, పౌరులుగా వారి బాధ్యతను ప్రోత్సహించేందుకు విలువైన అవకాశంగా నిలిచింది. ఇది సార్ధకమైన సంభాషణకు దోహదపడడమే కాకుండా, జ్ఞానంతో కూడిన, సామాజిక బాధ్యత కలిగిన పౌరులను నిర్మించాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపించింది.
ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు చిన్నారులు చక్కని సమాధానాలు ఇచ్చారు. ఓ విద్యార్థిని పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి మాట్లాడుతూ… ‘ఇటీవల చెన్నైలో ఎండలు ఎక్కువైపోతున్నాయి. నగరంలో చెట్లను నరికేస్తుండం వల్ల వాటి సంఖ్య తగ్గిపోతున్నది. వాహనాలు పెరగడం వల్ల కాలుష్యం ఎక్కువ అవుతున్నది. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం కారణంగా వ్యవసాయ పొలాల్లో పంటలు కూడా పండటం లేదు. కాబట్టి మనమంతా రావి, మర్రి, వేప లాంటి పెద్దగా పెరిగే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి.’ అని అన్నారు. స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మీడియా ప్రతినిధులు ప్రశంసించారు.
- ముహమ్మద్ ముజాహిద్, 9640622076