న్యూఢిల్లీ: హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపారు. కూతురి సంపాదనతో బతుకుతున్నావని గ్రామస్థులు హేళన చేయడం, తన మాట వినకుండా రాధిక టెన్నిస్ అకాడమీ నడుపుతుండటంతో దీపక్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తండ్రి దీపక్ యాదవ్ తన కుమార్తెపై ఐదు బుల్లెట్లు కాల్చగా, మూడు బుల్లెట్లు ఆమెను తాకాయి. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
బుల్లెట్ గాయాలతో ఉన్న ఒక మహిళను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. తర్వాత పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఆమె టెన్నిస్ అకాడమీని నడుపుతున్న రాధికాయాదవ్‌గా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తన కూతురిని తానే చంపినట్లు అతను అంగీకరించాడు.
పోలీసుల విచారణలో దీపక్ మాట్లాడుతూ… తన కూతురు భుజానికి గాయం కావడంతో ఆటను వదిలేసి టెన్నిస్ అకాడమీ తెరిచిందని చెప్పాడు. వజీరాబాద్‌లోని తన గ్రామానికి వెళ్లినప్పుడల్లా, తన కూతురు సంపాదనతో బతుకుతున్నానని ప్రజలు తనను ఎగతాళి చేసేవారని, ఇది తన గౌరవాన్ని దెబ్బతీసిందని అన్నారు. తన కూతురిని… అకాడమీని మూసివేయమని చెప్పానని, కానీ ఆమె నిరాకరించిందని, అది తనకు కోపం తెప్పించిందని చెప్పాడు.
ఈమేరకు గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసించే నిందితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. “ఉదయం 10 గంటల ప్రాంతంలో, నాకు పెద్ద శబ్దం వినిపించింది. నేను మొదటి అంతస్తుకు వెళ్ళినప్పుడు, నా మేనకోడలు-రాధిక వంటగదిలో పడి ఉండటాన్ని, డ్రాయింగ్ రూమ్‌లో తుపాకీని చూశాను. నా కొడుకు, నేను ఆమెను ఆసియా మారింగో ఆసుపత్రికి తీసుకెళ్లాము, అక్కడ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారని చెప్పాడు.” కాగా, పోలీసులు ఆమె తండ్రి ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం దర్యాప్తులో ఉంది.
రాధిక జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి. కానీ, కొద్ది కాలం క్రితం జరిగిన టెన్నీస్ పోటీల్లో పాల్గొన్న రాధికా యాదవ్‌కు తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నీస్‌కు దూరం కావడంతో మానసికంగా కృంగి పోయింది. అయితే తనలాగా టెన్నీస్‌లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు టెన్నీస్ అకాడమనీ ప్రారంభించింది. అనతికాలంలో తన కోచింగ్‌తో రాధికా యాదవ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తండ్రికి కూడా చేదోడు వాదోడుగా నిలిచింది.