గోల్పారా/న్యూఢిల్లీ: అస్సాంలో చేపట్టిన ఇళ్ల కూల్చివేత కార్యక్రమం దాదాపు 4,000 ముస్లిం మైనారిటీ కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. ఇంత పెద్ద ఎత్తున కూల్చివేతల తర్వాత జరిగిన పరిణామాలను అంచనా వేయడానికి జమియత్ ఉలామా-ఇ-హింద్ (JUH) ప్రధాన కార్యదర్శి మౌలానా హకీముద్దీన్ ఖాస్మి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంగళవారం అస్సాంలోని గోల్పారా జిల్లాను సందర్శించింది. అస్సాం ప్రభుత్వం “వివక్షత, రాజ్యాంగ విరుద్ధమైన” చర్యగా JUH అభివర్ణించింది.
JUH ప్రకారం, గోల్పారాలోని అషుదుబి, హసిలాబిల్ ప్రాంతాలలో మొత్తం 3,973 ఇళ్లు కూల్చివేసారు. ఇది ప్రధానంగా బెంగాలీ మూలాలు కలిగిన ముస్లింలను ప్రభావితం చేసింది. సంస్థ వాదన ప్రకారం, అనేక కుటుంబాలు 70 నుండి 80 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయి. అంతకుముందు నది కోత కారణంగా ఈ ప్రాంతానికి మారాల్సి వచ్చింది.
మౌలానా హకీముద్దీన్ ఖాస్మి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూల్చివేత ప్రదేశాలను సందర్శించింది. నిరాశ్రయులైన కుటుంబాలను కలుసుకుంది. భూమిపై మానవతా సంక్షోభాన్ని అంచనా వేసింది. “బాధల స్థాయి అపారమైనది. వీరు చట్టబద్ధమైన పౌరులు, వీరిలో చాలా మందికి ఓటరు ఐడిలు, ఆధార్ కార్డులు, భూమి సంబంధిత పత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ వారు రాత్రికి రాత్రే నిరాశ్రయులయ్యారు,” అని మౌలానా ఖాస్మి అన్నారు.
జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు JUH మెమోరాండం సమర్పించింది. ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలను “అమానవీయమైనది, చట్టవిరుద్ధమైనది, మతపరమైన ప్రేరణతో కూడినది” అని ఖండించింది, రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం-మెజారిటీ స్థావరాలను ఎంపిక చేసుకుని ఇతర వర్గాల నివాసాలను వదిలివేసిందని ఆరోపించింది.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే సందేహాస్పద పరిస్థితులలో కూల్చివేతలు జరిగాయని, కొన్నిసార్లు ప్రైవేట్ లేదా పారిశ్రామిక ఉపయోగం కోసం భూమిని క్లియర్ చేయడానికి కూడా ఇలా జరిగిందని మెమోరాండం ఆరోపించింది. “ఇది కేవలం గృహ సంక్షోభం కాదు – ఇది మానవ హక్కులు మరియు రాజ్యాంగ సంక్షోభం” అని అది పేర్కొంది.
నవంబర్ 2023 – జూలై 2025 మధ్య… గోల్పారా, ధుబ్రి, నల్బరి జిల్లాల్లో నిర్వహించిన కూల్చివేత డ్రైవ్‌లలో 21 మసీదులు, 44 మదర్సాలు/మక్తబ్‌లు, 9 ఈద్గాలను నాశనం చేయడంపై కూడా JUH ఆందోళన వ్యక్తం చేసింది. మౌలానా బద్రుద్దీన్ అజ్మల్, హఫీజ్ బషీర్ అహ్మద్ ఖాస్మి నేతృత్వంలోని జమియత్ ఉలమా అస్సాం రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం… మూడు జిల్లాల్లో 8,115 కుటుంబాలు, 32,530 మంది వ్యక్తులు ప్రభావితమయ్యారని అంచనా వేసింది.
సంక్షోభానికి ప్రతిస్పందనగా, జమియత్ ఉలమా అస్సాం తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేసి ఆహారం, గుడారాలు, వైద్య సహాయంతో సహా అత్యవసర సహాయాన్ని అందిస్తోంది. అయితే, పెరుగుతున్న మానవతా అవసరాన్ని తీర్చడానికి ఈ సహాయం సరిపోదని JUH నాయకులు అంగీకరిస్తున్నారు.
తక్షణ పునరావాసం, నిర్వాసిత కుటుంబాలకు న్యాయమైన పరిహారం, పునరావాసం కోసం అస్సాంలో ప్రభుత్వ ఖాస్ భూమిని కేటాయించడం, ఆహారం, స్వచ్ఛమైన నీరు, ఆశ్రయం వంటి మధ్యంతర ఉపశమనం అందించడం, కూల్చివేత కార్యక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని సంస్థ డిమాండ్ చేసింది.
JUH ప్రతినిధి బృందంలో సీనియర్ మతాధికారులు హఫీజ్ బషీర్ అహ్మద్ ఖాస్మి, మౌలానా అబ్దుల్ ఖాదిర్ ఖాస్మి, మౌలానా మహబూబ్ హసన్, మౌలానా ఫజల్ కరీం ఖాస్మి, మౌలానా ఇజ్జత్ అలీ, అబ్దుల్ హై, ముఫ్తీ సాదుద్దీన్, మౌలానా జాబీర్ ఖాస్మి, మౌలానా అబుల్ హషీం ఉన్నారు.