Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను 60 మంది మౌలానాలు ఎందుకు కలిశారు?

Share It:

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ జూలై 24న సంవాద్ (చర్చ) అనే అపూర్వమైన కార్యక్రమంతో తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 60 మందికి పైగా ప్రముఖ ఇమామ్‌లు, మౌలానాలు, ముఫ్తీలు ఒకచోటకు చేరారు.

ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఇమామ్‌ల సమావేశానికి హాజరవడం ఈ సందర్భాన్ని నిజంగా చారిత్రాత్మకంగా మార్చింది.

ఆర్‌ఎస్‌ఎస్ సెప్టెంబర్ 27, 1925న స్థాపితైంది. ఈ సంస్థ లక్ష్యం హిందూ సంస్కృతిని ప్రోత్సహించడం భారతదేశంలో హిందూ రాజ్యాన్ని స్థాపించడం.

అటువంటి పరిస్థితులలో, హిందూ – ముస్లిం వర్గాల మధ్య మతపరమైన అంతరాన్ని తగ్గించడం, దీర్ఘకాలిక అవగాహనను ప్రోత్సహించడం అనే ప్రధాన లక్ష్యంతో భగవత్… ఇమామ్‌లతో నాలుగు గంటల పాటు క్లోజ్డ్ డోర్ సమావేశం జరిగింది.

దీనిపై మరింత వివరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (AIIO) చీఫ్ ఇమామ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసితో ‘రెడిఫ్ వార్తా సంస్థ’ ప్రతినిధి సయ్యద్ ఫిర్దౌస్ అష్రఫ్ మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు మీకోసం….

మోహన్ భగవత్‌తో మీ సమావేశం ప్రాముఖ్యత ఏమిటి?
జూలై 24 మాకు ఒక సుదినం. యాభై సంవత్సరాల క్రితం మా సంస్థ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. అదేవిధంగా 1925లో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి ఈ ఏడాదికి వందేళ్లవుతోంది. అందువల్ల, మేము భగవత్‌జీని ‘సంవాద్’ పేరిట నిర్వహించిన చర్చా కార్యక్రమానికి ఆహ్వానించాము.

ఆయన మా సమావేశానికి రావడం ద్వారా మా కార్యక్రమాన్ని గౌరవించారు. ఈ ప్రోగ్రామ్‌కు హాజరు కావడానికి వివిధ మసీదులు, మదర్సాల నుండి 60 మంది ఇమామ్‌లు, ముఫ్తీలను ఆహ్వానించాము.

సంవాద్ అంటే సంభాషణ. RSS చీఫ్‌తో ఏ అంశంపై చర్చించారు?
గురువారం ఉదయం 9 గంటలకు మా కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలకు ముగిసింది. మేము వారితో దాదాపు నాలుగు గంటల పాటు సంభాషించాము. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను చర్చించాము.

భవిష్యత్తులో RSS, ఇమామ్ సంస్థ సంభాషణను కొనసాగిస్తాయని, దానిని ముందుకు తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సంభాషణ కొనసాగాల, దాని ప్రభావం క్షేత్ర స్థాయిలో కనిపించాలని కూడా మేము సూచించాము.

మీరు దానిని ఎలా సాధించాలని ప్లాన్ చేస్తున్నారు?
ప్రస్తుతం, మన దేశంలోని వివిధ మందిరాలు, మసీదుల మధ్య సంభాషణ జరగాలని మేము నిర్ణయించుకున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న మందిరాల పూజారులు, మసీదుల మౌలానాల మధ్య సంభాషణ జరగాలి. దేశవ్యాప్తంగా ఉన్న మదర్సాలు, గురుకులాల మధ్య కూడా సంభాషణ జరగాలి.

భారతదేశంలో 5.5 లక్షల (550,000) మసీదులు, 7 లక్షల (700,000) మందిరాలు ఉన్నాయి. దాదాపు 6 లక్షల (600,000) గురుకులాలు, 4.5 లక్షల (450,000) మదర్సాలు ఉన్నాయి. కాబట్టి వాటి మధ్య సంభాషణ జరిగితే, అది మన దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము.

ఇది చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది. నేను మళ్లీ అడుగుతున్నా.. మీరు దానిని ఎలా సాధిస్తారు?
ప్రజలను ఏకం చేయాలనుకునే వారికి అల్లాహ్ సహాయం చేస్తాడు. గురువారం కార్యక్రమం రెండు వర్గాల మధ్య అపార్థాలను తొలగించడానికి ఒక ఆరాధన కార్యక్రమం లాంటిది.

ఏదైనా సమస్యకు సంభాషణ మాత్రమే పరిష్కారం. మీరు ఒకరితో ఒకరు సంభాషణ చేసినప్పుడు, మీరు నమ్మకాన్ని పెంచుకుంటారు. కాగా, RSS చరిత్రలో ఇంత మంది మౌలానాలు ఒక కార్యక్రమానికి హాజరు కావడం ఇదే మొదటిసారి.

ఫోటో: ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్‌తో ఇమామ్ ఇలియాసి.

భారతీయ ముస్లింలలో RSS ముస్లిం వ్యతిరేక సంస్థ అనే భావన ఉంది. విభేదాలు ఉన్నప్పుడు మాత్రమే సంభాషణ అవసరం. అందువల్ల, మేము సంభాషణతో ముందుకు వెళ్తున్నాము. నిన్నటికిన్న మేము సంభాషణను ప్రారంభించాము, విశ్వాసాన్ని పెంపొందించడం ప్రారంభమైంది.

అయోధ్యలో రామాలయం ప్రాణ ప్రతిష్ఠకు మీరు కూడా హాజరయ్యారు; బహుశా ఆ కార్యక్రమానికి హాజరైన ఏకైక ముస్లిం మతాధికారి మీరే కావచ్చు. కానీ ముస్లిం సమాజం RSSని, ముఖ్యంగా BJPని విశ్వసించడం లేదని మేము చూస్తున్నాము. ఎందుకలా?
మా సమావేశం రాజకీయాల గురించి కాదు. మాకు రాజకీయాల గురించి ఆందోళన లేదు. మేము దేశ ప్రయోజనాలను చూడాలనుకుంటున్నాము. మేము పార్టీలు లేదా వ్యక్తుల గురించి చర్చించము.

ఏ అంశాలు సోదరభావాన్ని పెంపొందిస్తాయి? మీరు భగవత్‌తో ఏ అంశాలపై చర్చించారు?
ఈ సమావేశం సమస్యలను చర్చించడానికి కాదు, సూచనలు ఇవ్వడానికి మాత్రమే. మా ఏకైక ఉద్దేశ్యం మన దేశ శ్రేయస్సు, పురోగతి కోసం రెండు వర్గాల మధ్య సోదరభావాన్ని ప్రోత్సహించడం మాత్రమే.

RSS ముస్లిం వ్యతిరేకమని ముస్లిం సమాజానికి ఉన్న సందేహాన్ని మీరు లేవనెత్తారా?
మేము విశాల హృదయంతో మాట్లాడాము. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించాము.

దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఇమామ్‌లను RSS చీఫ్‌తో సమావేశానికి హాజరు కావాలని మీరు ఎలా ఒప్పించగలిగారు?
ఇది ఒక కార్యక్రమం కాదు, ఇబాదత్. హిందువులు దీనిని పూజ అని పిలుస్తారు. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవు. ఇది ప్రారంభం మాత్రమే. పరిస్థితులు మెరుగుపడటం చూడటానికి మీరు వేచి ఉండాలి.
భవిష్యత్తులో అల్లాహ్ మంచి కోసం పనులు చేస్తాడు.

RSS ప్రధాన సిద్ధాంతం ముస్లిం వ్యతిరేకమని భావిస్తారు. దీనిపై మీరు వ్యాఖ్యానించగలరా?
ఇది వ్యక్తిగత పరిశీలన కావచ్చు. ఇతరులు RSS గురించి ఏమనుకుంటున్నారో దానిపై నేను వ్యాఖ్యానించలేను. నేను RSS గురించి ఏమనుకుంటున్నానో అది నాకు ముఖ్యం. ఏదైనా సమస్యకు చర్చలు మాత్రమే ముందుకు వెళ్ళే మార్గం అని నేను భావిస్తున్నాను. దేశ ప్రయోజనాల దృష్ట్యా రెండు వర్గాల మధ్య పరిష్కరించాల్సిన ఏవైనా సమస్యలు ఉంటే, మేము కలిసి కూర్చుని వాటిని స్నేహపూర్వకంగా పరిష్కరించుకుంటాము.

అస్సాంలోని BJP ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా కూల్చివేత చర్యకు దిగుతున్నప్పుడు RSS తో మీ సంభాషణకు ఏమి జరుగుతుంది? భగవత్‌తో మీ చర్చలో అలాంటి అంశం ఏదైనా వచ్చిందా?
మేము జాతీయ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాము మరియు ఇక్కడ మీరు నన్ను ఒక నిర్దిష్ట రాష్ట్రం గురించి ప్రశ్న అడుగుతున్నారు. నేను మతం, మానవత్వం గురించి మాట్లాడుతున్నాను, కానీ మీరు నన్ను రాజకీయాల గురించి మాట్లాడాలని కోరుకుంటున్నారు.

కానీ అస్సాంలో కూల్చివేత కార్యక్రమం భారతీయ ముస్లింలకు నిజమైన సమస్య. వారు ముస్లింలు కావడం వల్లనే తాము నిరాశ్రయులవుతున్నామని వారు భావిస్తున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అలాంటి సమస్యల గురించి మాట్లాడారా? లేకుంటే కేవలం హిందూ-ముస్లిం ఐక్యత ర్యాలీల గురించి మాత్రమే చర్చించారా?
ఫలితాల కోసం మీరు వేచి చూడాలి. చరిత్రలో మనం మొదటిసారి ఇమామ్‌ల సంఘం ఆర్‌ఎస్‌ఎస్‌తో మాట్లాడుతోంది. ఆర్‌ఎస్‌ఎస్ కూడా తన వందేళ్ల చరిత్రలో మొదటిసారి మాతో మాట్లాడుతోంది..మా సమావేశం ఫలితం మంచిగా ఉంటుందని, మన దేశ శ్రేయస్సు కోసమని మేము విశ్వసిస్తున్నాము. దయచేసి అప్పటి వరకు మీరు వేచి ఉండండి.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.