పాట్నా: బీహార్‌లో అత్యంత వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాలో లేవనెత్తిన అంశాలపై ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వలసదారులను ఈ ప్రక్రియలో విస్మరించడం, తరువాత ఓటు హక్కును కోల్పోవడం అనే అంశాన్ని ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు హైలైట్ చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే… SIR కి అవసరమైన పత్రాల గురించి అరవై ఎనిమిది శాతం మంది ప్రజలకు ఇప్పటికీ తెలియదని ఓ సర్వే తాజాగా వెల్లడించింది. అంతేకాదు SIR ఫారమ్‌లను సమర్పించే ఆన్లైన్ పోర్టల్ గురించి డెబ్బై ఐదు శాతం మంది వినలేదు.
స్ట్రాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్వర్క్ (SWAN) నిర్వహించిన ఈ సర్వే, SIR కసరత్తులో బీహార్ నుండి వలస కార్మికులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లను హైలైట్ చేసింది. అలాగే లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోవడం గురించి ఆందోళనలను లేవనెత్తింది.
“ఫర్ ఎ ఫ్యూ డాక్యుమెంట్స్ మోర్” అనే పేరుతో ఈ సర్వే నివేదిక జూలై 19-21, 2025 మధ్య 29 మంది విద్యార్థి వాలంటీర్లు 1,411 మంది వలస కార్మికులను సంప్రదించి, 338 మందితో సర్వేలు పూర్తి చేసిన ఫోన్ సర్వే నుండి తీసుకున్నారు.
ప్రస్తుత విధానాలు, మినహాయింపులను నివారించడానికి చర్యలను తొందరపాటుతో ప్రకటించినప్పటికీ, వలస కార్మికులు ఈ ప్రక్రియపై అపనమ్మకంతో ఉన్నారని SWAN బృందం కనుగొంది. “చాలా మంది కార్మికులు SIR ఆవశ్యకతను ప్రశ్నించారు. ఆధార్ లేదా ఇప్పటికే ఉన్న ఓటరు IDలను ఉపయోగించే పాత ప్రక్రియను ఇష్టపడ్డారని ఆ సర్వే పేర్కొంది.
భారత ఎన్నికల కమిషన్ (ECI) సూచించిన 11 పత్రాలలో ఎక్కువ భాగం ఓటర్ల వద్ద నిజంగానే లేవని సర్వే కూడా ధృవీకరించింది. సర్వే ప్రకారం…ముప్పై ఐదు శాతం మంది ప్రతివాదులు 11 SIR- పత్రాలలో ఏవీ లేరు. మరోవైపు కొంతమందికి ఆధార్, ఓటరు ID కార్డ్, రేషన్, పాన్ కార్డులు వంటి మూడు పత్రాలు ఉన్నాయి, కానీ ECI పత్రాల జాబితాలో ఇవి లేకపోవడం గమనార్హం.
జూలై 10న SIR కి వ్యతిరేకంగా దాఖలైన అనేక పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, ఆధార్, రేషన్, ఓటరు కార్డులను ఈ ప్రక్రియలో పరిగణించాలని ECIని కోరింది. కానీ జూలై 21న ఇచ్చిన అఫిడవిట్లో, ఆధార్ “కేవలం గుర్తింపు రుజువు” కాబట్టి వాటిని అంగీకరించలేమని ECI వాదించింది.
సర్వేలో పాల్గొన్న వారిలో తొంభై ఆరు శాతం మంది ఆధార్ కార్డులు, ఎనభై నాలుగు శాతం మంది ఓటరు IDలు, అరవై తొమ్మిది శాతం మంది PAN కార్డులు, అరవై నాలుగు శాతం మంది రేషన్ కార్డులు ఉన్నాయని తేలింది. కనీసం ఒక SIR పత్రం ఉన్నవారిలో, నలభై ఆరు మంది మెట్రిక్యులేషన్ లేదా విశ్వవిద్యాలయ సర్టిఫికేట్, యాభై శాతం మంది కుల ధృవీకరణ పత్రం, ముప్పై శాతం మంది నివాస ధృవీకరణ పత్రం, ముప్పై తొమ్మిది శాతం మంది జనన ధృవీకరణ పత్రం కలిగి ఉన్నారు.
సర్వేలో యాభై మూడు శాతం మంది… తమ ఇంటిని ఎన్నికల అధికారి సందర్శించారని నివేదించారు, కానీ ఇరవై తొమ్మిది శాతం మంది మాత్రమే SIR పత్రాన్ని సేకరించారని చెప్పారు. 45 శాతం మంది అధికారులు ఆధార్ కార్డులు లేదా ఓటరు ID కార్డుల ఆధారంగా ఫారమ్‌లను తీసుకున్నారని నివేదించారు.
2003 తర్వాత 18 ఏళ్లు నిండిన ప్రతివాదులలో 81 శాతం మందికి ఓటరు ఐడి కార్డులు ఉండగా, ప్రతి ముగ్గురిలో ఒకరికి SIR పత్రాలు లేవు. కాగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 2003 ఓటరు జాబితాలో పేర్లు లేని వారు ఓటు హక్కు పొందాలంటే ECI మార్గదర్శకాల ప్రకారం అర్హత పత్రాలు తప్పని సరిగా సమర్ఫించాల్సిందే. సర్వేలో పాల్గొన్న వారిలో డెబ్బై ఐదు శాతం మంది నెలకు రూ. 17,000 కంటే తక్కువ సంపాదించారని తేలింది.
వలసదారులు దూరంగా ఉన్నప్పుడు వారి ఇళ్ల నుండి తరచుగా ఫారమ్‌లను సేకరించారని, ఎక్కువ మందికి ఆన్లైన్ సమర్పణ వ్యవస్థ గురించి తెలియదని SWAN పేర్కొంది. ఓటరు జాబితాను నవీకరించడానికి ఉద్దేశించిన SIR కసరత్తు దాని సంక్లిష్టత కారణంగా లక్షలాది మంది ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
SIR ప్రక్రియ సాధ్యా సాధ్యాలు, వలస కార్మికులకు ఉన్న అడ్డంకులను పేర్కొంటూ… SWAN దానిని వెంటనే రద్దు చేయాలని పిలుపునిచ్చింది. SIR కి సంబంధించిన చట్టపరమైన సవాళ్లు సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నందున, ఈ నివేదిక బీహార్‌లోని బడుగు, బలహీనవర్గాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న ఆందోళనలను పెంచుతుంది.
COVID-19 లాక్డౌన్ సమయంలో 2020 మార్చి 27న SWAN స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. అప్పుడు ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులకు సహాయం చేసిన చరిత్ర ఈ సంస్థకు ఉంది. తాజా సర్వే బీహార్ నుండి వలస వచ్చిన కార్మికులపై దృష్టి పెట్టింది. వీరిలో చాలా మందికి లాక్డౌన్ సమయంలో SIR ప్రక్రియకు సంబంధించి SWAN సహాయం చేసింది