న్యూఢిల్లీ: ఇటీవలి సంవత్సరాలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఒక ప్రధాన సామాజిక సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రైమ్ బ్యూరో 2022లో ప్రచురించిన ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా’ నివేదికను ఉటంకిస్తూ.. చాలా దారుణమైన పరిస్థితులను గమనిస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘మానసిక ఒత్తిడి, విద్యాభారం, విద్యాసంస్థల తీరు, సామాజిక వివక్ష వంటి కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది వ్యవస్థాపక వైఫల్యాన్ని సూచిస్తోందని’’ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.
ఏపీ నీట్ పరీక్ష రాసిన 17 ఏళ్ల యువతి ఆత్మహత్య కేసును సీబీఐకి బదలాయించాలన్న అప్పీల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
వంద లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న అన్ని విద్యాసంస్థలు కనీసం ఒక అర్హత కలిగిన కౌన్సెలర్‌ను నియమించాలని, తక్కువ మంది విద్యార్థులు ఉన్న విద్యాసంస్థలు మానసిక ఆరోగ్య సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకోవాలని కోర్టు ఆదేశించింది. సంస్థలు పాఠ్యేతర కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, విద్యార్థులను బహిరంగంగా అవమానించకుండా ఉండాలి. మానసిక ఆరోగ్య నిపుణులచే వారి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.
అంతేకాదు “విద్యా సంస్థల్లో విద్యార్థి- కౌన్సెలర్ నిష్పత్తిని గరిష్ట సంఖ్యకు పెంచాలి. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్ తదితరాల వేళ నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సూసైడ్ హెల్ప్ లైన్ నంబర్లు, టెలీ-మానస్ తదితర జాతీయ సేవల చిరునామా, ఫోన్ నంబర్లను విద్యా సంస్థలు, హాస్టళ్లు, తరగతి గదులతో పాటు వెబ్సైట్లలో కూడా ప్రముఖంగా కనిపించేలా ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
విద్యార్థుల్లో ఆత్మహత్యకు సంబంధించిన ధోరణులను తొలి దశలోనే గుర్తించి, సరిగా స్పందించగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మానసిక ఆరోగ్య అక్షరాస్యత, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, జీవ కళా విద్య వంటివాటికి తరగతి గదుల్లో చోటివ్వాలి. విద్యాపరమైన ఒత్తిళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యా సంస్థలే నివారణ చర్యలు చేపట్టాలి” అని పేర్కొంది.
పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడంలో తల్లిదండ్రులకు కూడా ముఖ్యమైన పాత్ర ఉంది. క్యాంపస్‌లు అనారోగ్యకరమైన పోటీకి వేదికలుగా మారకూడదు. బదులుగా అక్కడ విద్యార్థులకు అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు జారీ చేసిన మార్గదర్శకాలు అన్నింటికంటే సమగ్రమైనవని విశ్లేషకులు చెబుతున్నారు.