న్యూఢిల్లీ: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్‌పై నిన్న ఎట్టకేలకు చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటుకు గైర్హాజరయ్యారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఏప్రిల్ 22 ఉగ్రవాద దాడి గురించి కేవలం ప్రస్తావించారు.నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంతరం చేస్తున్న వాదనలను ప్రస్తావించలేదు.
బదులుగా, భారతదేశం ఇప్పటికే తన “ప్రకటించిన రాజకీయ, సైనిక లక్ష్యాలను” సాధించిందని, “ఎవరి ఒత్తిడితో ఆపరేషన్ నిలిపివేసాం” అని చెప్పడం నిరాధారమైనది, పూర్తిగా తప్పు” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్ తట్టుకోలేకపోయిందని చెప్పారు. వెంటనే కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. పాక్ డీజీఎంవో వెంటనే భారత్‌ను సంప్రదించినట్లు చెప్పారు.
కాగా, పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షం నెలల తరబడి ఒత్తిడి చేసిన తర్వాత సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది, అయితే మోడీ సభలో లేరు. ఇక రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో చేసిన ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్,దాని విజయాలపై దృష్టి సారించారు. పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులు భారతదేశంలోకి ఎలా ప్రవేశించారు, వారిపై దర్యాప్తు స్థితి, వారు పారిపోయిన వైనంపై ఎటువంటి ప్రస్తావన లేదు.
మరోవంక దేశ విదేశాంగ విధానానికి జరుగుతున్న నష్టం, అమెరికా జోక్యం తదితర అంశాలపై విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గగోరు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చాలా విషయాలు చెప్పారని, కానీ పెహల్గామ్కు ఎలా ఉగ్రవాదులు వచ్చారో చెప్పలేదని అన్నారు. పెహల్గాం ఉగ్రదాడికి కేంద్ర మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. పాకిస్థాన్, భారత్ మధ్య కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు 26 సార్లు వెల్లడించారని, దీనిలో నిజం ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించారో ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు.
శివసేన (ఠాక్రే) ఎంపి అరవింద్ సావంత్ మాట్లాడుతూ ఎన్నికలు జరగనున్న బీహార్‌కు ప్రధాని మోడీ వెళ్లారని, కానీ పెహల్గాంకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మణిపూర్‌కు కూడా ఇంత వరకు ఎందుకు వెళ్లలేదన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి కారణం భద్రతా లోపాలేనని సిపిఎం ఎంపి ఎస్. వెంకటేశన్ అన్నారు. తీవ్రమైన ఆ భద్రతా లోపాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఉగ్రవాద దాడి సమయంలో సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోడీ పహల్గాంకు వెళ్తారని దేశం భావించినప్పటికీ, ఆయన బీహార్‌కు వెళ్లారని విమర్శించారు. ఈ చర్యతో మోడీ తన మనసులో ఎన్నికలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారన్నారు.
టిఎంసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ పట్ల అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ట్విట్టర్లో ఎందుకు పోస్టు చేయడం లేదని ప్రధాని మోడీని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడి ముందు మీరు నిలబడినప్పుడు మీ ఎత్తు 5 ఫీట్లకు తగ్గుతుందని, మీ ఛాతి 56 ఇంచుల నుంచి 36 ఇంచులకు కుంచించుకుపోతుందని ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడంటే మీరెందుకు అంత భయపడుతున్నారని ప్రశ్నించారు.
కాగా, ఈ సంఘర్షణలో భారత్ కోల్పోయిన రాఫెల్ జెట్ల సంఖ్య గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, సైనిక నాయకత్వం “పోరాటంలో ఒక భాగం” వంటి అంగీకారాలు తప్ప ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం లేదు.
ఎన్ని భారతీయ జెట్లు పోయాయని ప్రతిపక్షం అడుగుతుండగా, ఎన్ని పాకిస్తాన్ జెట్లు కూలిపోయాయో వారు అడగలేదని రక్షణమంత్రి సింగ్ వాదించారు.